Breaking News

రెబల్‌ ఎమ్మెల్యేల ఇళ్లకు నోటీసులు

రెబల్‌ ఎమ్మెల్యేల ఇళ్లకు నోటీసులు

జైపూర్‌‌: సీఎల్పీ సమావేశాలకు హాజరు కాకుండా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, సచిన్‌పైలెట్‌కు సపోర్ట్‌ చేసిన 19 మంది పార్టీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ కొంచెం కఠినంగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే 19 మందికి నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ వాళ్ల ఇళ్లకు నోటీసులు అంటించారు. వాళ్లంతా ఎక్కడున్నారో తెలియనందున తప్పించుకునేందుకు వీలు లేకుండా వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ ద్వారా నోటీసులు పంపారు. అంతే కాకుండా వాళ్ల నివాసాలకు ఇంగ్లీష్‌, హిందీల్లో ఉన్న నోటీసులను కూడా అంటించారు.

‘మీటింగ్‌ గురించి తెలిసి కూడా కొంత మంది ఉద్దేశపూర్వకంగా కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది. కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌‌ పార్టీ మీటింగ్‌కు హాజరు కావాలని అభ్యర్థిస్తున్నాం. హాజరుకాలేని పక్షంలో కారణాలు తెలియజేయండి. మీరే సంతకం చేసిన స్టేట్‌మెంట్‌ పంపండి. రాని పక్షంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వెళ్లేందుకు సుముఖత చూపినట్లే పరిగణనలోకి తీసుకుంటాం. రాజ్యాంగపరంగా చర్యలు ఉంటాయి’ అని ఆ నోటీసులో ఉంది. సీఎల్పీ సమావేశానికి హాజరు కానందుకు రెబల్‌ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రెండ్రోజుల్లో దానికి సంబంధించి వివరణ ఇవ్వాలని కోరింది. రాజస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం లేదంటూ మాజీ ఉపముఖ్యంత్రి సచిన్‌ పైలెట్‌ పార్టీపైన తిరుగుబాటు చేశారు. సీఎల్పీ సమావేశాలకు హాజరు కాకపోవడంతో పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంది. ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.