- ఏపీలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం
- సిటీ సర్వీసులకు అనుమతి లేదు
- నగదురహిత టికెట్ లు జారీ
సారథి న్యూస్, అనంతపురం, శ్రీకాకుళం: కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు 58 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో గురువారం ఉదయం ఎట్టకేలకు రోడ్డెక్కాయి. ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించడంతో విజయవాడ, విశాఖ సిటీ సర్వీసులు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్ సర్వీసులు రాకపోకలు సాగించాయి. ఆన్‌లైన్ బుకింగ్ కూడా బుధవారం సాయంత్రం నుంచే ప్రారంభమైంది. రాష్ట్రంలోని 436 మార్గాల్లో 1,683 బస్సు సర్వీసులను నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సంస్థకు మొత్తం 12వేల బస్సులు ఉండగా ప్రస్తుతం 1,683 బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి దశలవారీగా సర్వీసుల సంఖ్యను పెంచుతామని చెబుతున్నారు. ఉదయం నుంచే ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ప్రయాణికుల సందడి నెలకొంది. విశాఖపట్నంలోని ద్వారకా బస్ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికులు బారులుదీరారు. పరిమిత సీట్లతో బస్సులు నడుపుతున్నప్పటికీ ఆర్టీసీ చార్జీలు పెంచకపోవడం సంతోషించదగ్గ విషయమేనని ప్రయాణికులు చెబుతున్నారు. అయితే రాయితీ పాసుదారులను అనుమతించకపోవడంపై ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి.
బస్టాండ్ నుంచి మరో బస్టాండ్
ప్రస్తుతానికి బస్టాండ్ల మధ్య మాత్రమే బస్సు సర్వీసులను నడుపుతున్నారు. నగదురహిత విధానంలోనే టికెట్లు జారీచేస్తున్నారు. ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులను మాత్రమే బస్సులోకి అనుమతిస్తున్నారు. అన్ని బస్టాండ్లలోనూ కరెంట్ బుకింగ్ సదుపాయం కల్పించారు. కౌంటర్‌లో టికెట్ కొనుగోలు చేసేవారి పేరు, ఫోన్ నంబర్ నమోదు చేస్తున్నారు. తప్పనిసరిగా మాస్కులు వినియోగించాలని సూచిస్తున్నారు. దూరప్రాంతానికి రాత్రివేళల్లో సర్వీసుల్లో వెళ్లాలనుకునేవారు సాయంత్రం 7 గంటల్లోపే బస్టాండ్ లకు చేరుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సాయంత్రం 7 గంటల తర్వాత కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 65ఏళ్లకు పైబడినవారు, పదేళ్లలోపు చిన్నారులు అత్యవసరమైతేనే తప్ప ప్రయాణం చేయొద్దని సూచిస్తున్నారు. ప్రతి ప్రయాణికుడికి మాస్క్ ఉందని ధ్రువీకరించిన తర్వాతే టికెట్ ఇస్తున్నారు. అలాగే అందరూ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. బస్సులు నడుస్తున్నాయనే విషయం చాలామందికి తెలియకపోవడంతో రద్దీ కాస్త తక్కువగానే కనిపిస్తోంది.
శానిటైజేషన్ తప్పనిసరి
శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్టీసీ డిపో నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. ప్రయాణికులు భౌతికదూరం పాటిస్తూనే బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. పాలకొండ డిపో పరిధిలో 17 సర్వీసులను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. బస్సుల్లో ప్రయాణించే వారు తప్పని సరిగా మాస్క్ కట్టుకోవాలని సూచించారు. బస్సులు డిపో నుంచి బయటికి వచ్చినప్పుడు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేయిస్తున్నామని తెలిపారు. ఆర్డీవో టీవీఎస్ జే కుమార్ మాట్లాడుతూ..ప్రయాణికులు కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా ఏర్పాటుచేసినట్టు వివరించారు. బస్సు ఎక్కే ముందు చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు.