Breaking News

రక్తదానం గొప్పకార్యం

సారథి న్యూస్​, వనపర్తి: ఆపదలో ఉన్న వారిని రక్తదానం చేసి ఆదుకోవచ్చని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వనపర్తిలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్​లో ఏర్పాటుచేసిన ఉచిత రక్తదాన శిబిరానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

రెడ్ క్రాస్ సంస్థ ద్వారా కరోనా సమయంలోనూ రక్తదాన శిబిరాలు నిర్వహించి సుమారు ఐదొందల యూనిట్ల వరకు రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. ఎక్కువ సార్లు రక్తదానం చేసిన దాతలు అమర్, పోచ రవీందర్ రెడ్డి, ప్రవీణ్, జ్ఞానేశ్వర్, మురళిని ఘనంగా సన్మానించారు. అనంతరం రక్తదానం చేసిన 48 మందికి సర్టిఫికెట్లు అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షుడు ఖాజాకుతుబుద్దీన్​, ఆర్డీవో చంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.