Breaking News

యజ్ఞోపవీత మహిమ

యజ్ఞోపవీత మహిమ

వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. దీనినే తెలుగులో ‘జంధ్యం’ అంటాం. యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.
సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్
తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్

బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం. యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైంది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్…’ అనే మంత్రం చెబుతోంది. యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటుందని స్మృతుల కథనం


ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చసోమః పితృప్రజాపతీ
వాయుఃసూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ
ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ
తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా
పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః
సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ
సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః

మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువులో అగ్నిదేవుడు, మూడవ తంతులో నాగదేవత, నాలుగవ తంతువులో సోమదేవుడు, ఐదవ తంతువులో పితృదేవతలు, ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులో వాయుదేవుడు, ఎనిమిదవ తంతువులో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలంతా ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం. ‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదో 96 విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది.
తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్
కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్

ఈ శ్లోకంలో తాత్పర్యం ఇది. తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం. ‘యజ్ఞోపవీతం’ 96 కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది.
చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ
తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్

నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించారు. అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) 96 తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కావునా, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం. యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారుచేసుకోవాలో సాముద్రిక శాస్త్రం ప్రబోధించింది.


పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్
తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్
ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్
యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్

అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. దానికంటే పైన గానీ, కింద గానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.
బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. వీళ్లిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరునెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాత దానిని తొలగించాలి. యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాల్లో) ఇతర అమంగళాలు కలిగిన సందర్భాల్లో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చేయడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శన కోసం కాదు. ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి. ఇదే యజ్ఞోపవీత మహిమ..
:: దిండిగల్​ ఆనంద్​శర్మ
సీనియర్ ​జర్నలిస్ట్​
సెల్​నం.96660 06418