Breaking News

మిర్చి రైతులకు న్యాయం చేయండి

మిర్చి రైతులకు న్యాయం చేయండి


సారథి న్యూస్, కర్నూలు: రైతులకు నాసిరకం మిరప మొక్కలను సరఫరా చేసిన నర్సరీ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి నుంచే నష్టపరిహారం రాబట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ అధికారులను డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట మిర్చి రైతులకు నర్సరీ యాజమాన్యం నష్టపరిహారం ఇచ్చి న్యాయం చేయాలని కోరారు.

రామళ్లకోట గ్రామంలో సుమారు వెయ్యి ఎకరాల్లో మిరప పంటవేశారు. స్థానిక వీఎన్ఆర్​కంపెనీ నుంచి విత్తనాలు తెచ్చి నర్సరీ ద్వారా మొక్కలు పెంచి ఒక మొక్కకు 0.70 పైసల చొప్పున రైతులకు విక్రయిస్తారు. ఎకరాకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెడతారు. నర్సరీ వారి వద్ద తీసుకున్న మొక్కలు 40 రోజుల వరకు ఏపుగా పెరిగి ఆ తర్వాత పంటకు బింగి వచ్చిందని రైతులు వాపోయారు. ఈ మేరకు రైతు సంఘం నాయకులు పంటను శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్​జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. పంటను పరిశీలించిన వారిలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, సీఐటీయూ జిల్లా నాయకుడు షాజహాన్​, రైతులు పుల్లయ్య, సోమన్న, లింగమయ్య, రాజు, రామానాయుడు, ఉశేనిబాషా, నాగేంద్రం ఉన్నారు.