న్యూఢిల్లీ: ఇండియా, చైనా మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, మూడో పార్టీ జోక్యం వద్దని చైనా చెప్పింది. రెండు దేశాలు సమస్యను పరిష్కరించుకోగలవని దీమా వ్యక్తం చేసింది. ఇండియా, చైనా మధ్య నెలకొన్ని బోర్డర్ ఇష్యూను మధ్యవర్తిగా ఉండి తాను పరిష్కరిస్తానని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో చైనా ఫారెన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి లిజాంగ్ సమాధానం చెప్పారు. ‘ఈ సమస్యను ఇండియా, చైనా సామరస్యంగా పరిష్కరించుకుంటాయి. మూడో వ్యక్తి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండు దేశాల మధ్య బోర్డర్ మెకానిజం, కమ్యూనికేషన్ చానల్స్ ఉన్నాయి’ అని ఆయన అన్నారు. ఇండియా, చైనా మధ్య సరిహద్దులో తలెత్తిన ప్రతిష్టంభన తొలగించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు తాను రెడీగా ఉన్నానని ట్రంప్ అన్నారు. తన ప్రమేయం ఉపయోగపడుతుందని రెండు దేశాలు భావిస్తే తాను మాట్లాడతానని ట్రంప్ ప్రకటించారు. ఈ విషయంపై మోడీకి ఫోన్ చేస్తే ఆయన మూడ్ బాగోలేదని చెప్పారు. కాగా.. ట్రంప్ మోడీతో మాట్లాడలేదని అధికారులు చెప్పారు.