సారథి న్యూస్, ములుగు: సఖి కేంద్రాలు మహిళలు, బాలికలకు అండగా నిలవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య సూచించారు. మంగళవారం ములుగు జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో సఖి జిల్లా నిర్వహణ కమిటీ, జిల్లా బాలసంరక్షణ సొసైటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహహింస, లైంగిక హింసలను ఎదుర్కొనే మహిళలు, బాలికలకు రక్షణ, న్యాయ, వైద్య సహాయాలు అందుతాయని అన్నారు. జిల్లాలో మార్చి 8న సఖి కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో సహకారం కావాల్సిన 346 మంది పిల్లలను గుర్తించామని, 248 మంది పిల్లలను బాలల సంరక్షణ కమిటీ ఎదుట ప్రవేశపెట్టామని వివరించారు. 38 బాల్య వివాహాలను ఆపినట్లు తెలిపారు.
చైల్డ్ లైన్ 1098 ఏర్పాటు చేశామన్నారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 30 పిల్లలను గుర్తించి, వారికి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. జిల్లాలోని 19 పాఠశాలల్లో గర్ల్ చైల్డ్ ఎంపర్మెంట్ క్లబ్బులు ఏర్పాటుచేసి, ప్రతినెలా 3వ శుక్రవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. సహాయం కోసం వచ్చే బాధితులకు మంచి వాతావరణం స్ఫూరించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దాలన్నారు. అనంతరం కలెక్టర్ సఖి కేంద్రం మహిళా హెల్ప్ లైన్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో ములుగు ఏఎస్పీ సాయిచైతన్య, డీఆర్డీవో ఏ.పారిజాతం, డీఎంహెచ్వో డాక్టర్ఎ.అప్పయ్య, డీపీవో వెంకయ్య, డీఈవో వాసంతి, డీడబ్ల్యూవో మల్లీశ్వరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జలందర్ రెడ్డి, సఖి సీఈవో సాల్మన్ రాజ్ పాల్గొన్నారు.