న్యూఢిల్లీ: భారత్ జట్టుకు మళ్లీ ప్రాతినిథ్యం వహించాలన్నది తన కల అని పేసర్ శ్రీశాంత్ అన్నాడు. ఇందుకోసం ఎంతవరకైనా శ్రమిస్తానన్నాడు. ‘2023 ప్రపంచకప్‌లో ఆడతాననే నమ్మకం ఉంది. అంతేకాదు నేను ఎక్కడైతే శిక్షకు గురయ్యానో.. అదే ఐపీఎల్లో మళ్లీ సత్తా చాటుతా. ఈ విషయాన్ని బలంగా విశ్వసిస్తున్నా. నేను పునరాగమనం చేస్తున్నది కేవలం రంజీల కోసం కాదు. టీమిండియా, ఐపీఎల్‌కు ఆడటం నా ప్రధాన లక్ష్యం. జట్టుకు విజయాలు అందించాలనే కసి, పట్లుదల నాలో ఇంకా చావలేదు. అందుకే కనీసం భారత్‌కు ఒక్క మ్యాచ్ అడి అయిన చనిపోతా’ అని శ్రీశాంత్ పేర్కొన్నాడు. నిషేధ సమయంలో మానసికంగా కుంగిపోయిన తనను హర్భజన్, ఇర్ఫాన్ పఠాన్ ఆదుకున్నారన్నాడు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతోనే సినిమాల్లో నటించానన్నాడు. ఇక నిషేధం తొలగబోతున్న నేపథ్యంలో క్రికెట్ పైనే తన ధ్యాస ఉంటుందని వెల్లడించాడు. ‘నిషేధం తరువాత.. ప్రపంచం నావైపు వేలెత్తి చూపింది. పిచ్చిపిచ్చి ఆలోచనలో చాలా భయపడేవాడిని. అమ్మానాన్నలకు కనీసం ముఖం కూడా చూపించలేకపోయా. నా బలహీనతలను కప్పి పుచ్చుకోవడానికి ముఖాన నవ్వు పులుముకుని వచ్చా’ అని శ్రీ వివరించాడు. పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న తనకు మైకేల్ జోర్డాన్, కోబ్ బ్రయాంట్ కు ట్రైనర్‌గా వ్యవహరించిన టిమ్ గ్రోవర్ తనకు బాగా సాయం చేస్తున్నాడని చెప్పాడు. ప్రతి రోజు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇండోర్‌లో ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పిన శ్రీశాంత్.. తన బౌలింగ్ శైలి మారలేదని సంతోషం వ్యక్తం చేశాడు.