- గ్రీన్ జోన్‌లోనూ ఇద్దరి పాజిటివ్
- మెదక్‌లో చాపకింద నీరు మహమ్మారి
సారథి న్యూస్, మెదక్: గ్రీన్ జోన్ గా మారిన మెదక్ జిల్లాలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది.. చాపకింద నీరులా మహమ్మారి విజృంభిస్తోంది.. జిల్లాలో కొత్తగా ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు, చేగుంట పట్టణానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి హైదరాబాద్ లో టెస్ట్ లు నిర్వహించగా కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని డీఎంహెచ్ వో డాక్టర్ వెంకటేశ్వర్ రావు తెలిపారు. కొడపాకకు చెందిన బాలుడు అస్వస్థతకు గురికాగా హైదరాబాద్ లోని నారాయణ హృదయాలయంలో చికిత్సకు వెళ్లగా అక్కడ నిర్వహించిన టెస్ట్‌లో కరోనా పాజిటివ్ గా తేలిందన్నారు. అలాగే చేగుంటకు చెందిన వ్యక్తి హైదరాబాద్ లోని మెడికోవర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కోసం వెళ్లగా కరోనా బారినపడినట్లు గుర్తించారు. ఈ మేరకు ఇద్దరినీ వ్యాధి నిర్ధారణ, ట్రీట్మెంట్ కోసం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆ రెండు గ్రామాల్లోని మూడు కాలనీలను కంటైన్మెంట్ ఏరియాలుగా గుర్తించారు. స్థానికులు ఎవరూ బయటికి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, మార్చి, ఏప్రిల్ నెలల్లో జిల్లాలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితులు గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మళ్లీ కరోనా వైరస్ కేసులు బయటపడడం జిల్లావాసులను కలవరపెడుతోంది.