- జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు
- 25 గేట్లు ఎత్తి.. 2.02లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
- శ్రీశైలం రిజర్వాయర్‌కు తరలివస్తున్న వరద నీరు
సారథి న్యూస్, కర్నూలు/మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు బిరబిరా మంటూ కృష్ణవేణి శ్రీశైలం మల్లన్న సన్నిధికి చేరుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాం నిండుకుండలా మారి జలకళ సంతరించుకుంది. దీంతో గేట్లు ఎత్తివేయడంతో జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. జూరాల ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి 2.02లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ శ్రీశైలం డ్యాం వైపునకు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం అర్ధరాత్రిలోగా డ్యాంలోకి దాదాపు 22 టీఎంసీల నీరు చేరుతుందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
జూరాల 25 గేట్లు ఎత్తివేత
వారంరోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాలకు వరద నీరు వేగంగా చేరుతుండడంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాం గేట్లను ఎత్తివేశారు. దీంతో జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టులో 25 గేట్లను ఎత్తివేసి 2.02లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్ వే ద్వారా 1.92లక్షల క్యూసెక్కులు, పవర్‌హౌస్ ద్వారా 22,634 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.203 టీఎంసీల నీటినిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా 317.650 మీటర్లు ఉంది.
మల్లన్న సన్నిధికి కృష్ణమ్మ
దిగువ ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురువకపోయినా.. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాలకు శ్రీశైలం డ్యాంకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జూరాలలో 25 గేట్లు ఎత్తి 1,99,772 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా మరో 22,634 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 78.0365 టీఎంసీల నీటినిల్వ ఉంది. 885 అడుగులకు గాను 849.10 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు చేరుతుండడంతో పరీవాహక ప్రాంత ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.