Breaking News

మల్కాపూర్ ను సందర్శించండి

  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు

సారథి న్యూస్, మెదక్: సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు సరైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. డెంగీ, మలేరియా, స్వైన్​ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించడంతో పాటు వారిని సురక్షితంగా ఉంచాలన్నారు. గ్రామాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రతిఒక్కరూ మెదక్ జిల్లాలోని మల్కాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ఆ గ్రామాన్ని సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఒకసారి చూసి రావాలని కోరారు.

మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని 469 గ్రామాల్లో పల్లెప్రగతి పనులు సకాలంలో జరుగుతున్నాయని వివరించారు. దోమల నివారణకు ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో మందు స్ప్రే, మలాథియాన్ ఆయిల్ బాల్స్, ఫాగింగ్ చేయాలని అధికారులు, సిబ్బందికి సూచించామన్నారు. దీంతో పాటు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అన్ని గ్రామాల్లో వారానికి ఒకసారి సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం స్ప్రే చేస్తున్నామన్నారు. మురికి కాల్వలో పూడికతీత, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని ఎత్తిపోయడం వంటి కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా చేపడుతున్నామన్నారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద కొత్తగా జాబ్కార్డులు జారీ చేశామని, ఈ పథకంలో కెనాల్ పనులు, వాటర్ కన్సర్వేషన్ పనులు ప్రారంభించామన్నారు. ఆయా గ్రామాల్లోని నర్సరీల్లో 44 లక్షల మొక్కలు రెడీగా ఉన్నాయని, వాటిని నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మెదక్ జడ్పీ చైర్​ పర్సన్​ హేమలత, అడిషనల్ కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీపీవో హనోక్, డీఆర్డీవో శ్రీనివాస్, డీసీవో పద్మ పాల్గొన్నారు.