Breaking News

మనోహర్ పారిపోయాడు

మనోహర్ పారిపోయాడు

రాజ్​కోట్​: ఐసీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న శశాంక్ మనోహర్​పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ తీవ్ర విమర్శలు చేశాడు. సంక్షోభకాలంలో పదవుల నుంచి తప్పుకోవడం అతనికి అలవాటైందని ధ్వజమెత్తాడు. ‘2015లో బీసీసీఐ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని ఐసీసీకి వెళ్లాడు. ఇప్పుడు బీసీసీఐలో కొత్త నాయకత్వం వచ్చాకా.. స్వలాభం కోసం బోర్డు (ఐసీసీ)ను వాడుకోలేనని తెలిసిపోయింది. దీంతో కరోనా కాలంలో అంతర్జాతీయ బాడీ నుంచి పారిపోతున్నాడు. మనోహర్ సొంత లాభం కోసమే పనిచేస్తాడు. భారత క్రికెట్​ను ఆర్థికంగా చాలా దెబ్బతీశాడు. క్రికెట్​ కు చాలానష్టం చేశాడు. ప్రపంచ క్రికెట్​ బీసీసీఐ ప్రాధాన్యం తగ్గించాడు. అన్ని వ్యతిరేక నిర్ణయాలే తీసుకున్నాడు’ అని శ్రీని పేర్కొన్నాడు.

బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా కూడా మనోహర్​ను విమర్శించాడు. అతడు ఆత్మపరిశీలన చేసుకుంటే భారత క్రికెట్​ కు ఎంతనష్టం చేశాడో అర్థమవుతుందన్నాడు. నాలుగేళ్లుగా ఐసీసీ చైర్మన్​గా పనిచేసిన మనోహర్.. నిబంధనల ప్రకారం మరో రెండేళ్లు పదవిలో ఉండడానికి పోటీపడొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐసీసీలో కొనసాగడం కష్టమని పదవి నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇక నుంచైనా భారత క్రికెట్​ కు చాలా మేలు కలుగుతుందని భావిస్తున్నారు.