- ఆర్టీవో చెక్ పోస్టు వద్ద భారీగా మద్యం పట్టివేత
- 588 మద్యం బాటిళ్లు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన సెబ్ సీఐ రాజశేఖర్ గౌడ్
సారథి న్యూస్, కర్నూలు: అక్రమ మద్యం రవాణాదారులకు పలుమార్లు చెప్పినా మార్పు రావడం లేదని, పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తరలిస్తూ వారి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సీఐ రాజశేఖర్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు హైవేలోని టోల్ గేట్ వద్దనున్న ఆర్టీవో చెక్‌పోస్టు వద్ద సెబ్ పోలీసు వాహనాలను తనిఖీ చేస్తుండగా తెలంగాణ మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. పత్తికొండ పట్టణానికి చెందిన సాయిమురళీ, షేక్ మున్నా బాషు 16 బాక్స్‌లో 588 మంది బ్రాందీ, విస్కీ ఫుల్ బాటిల్స్ తరలిస్తుండగా పట్టుకున్నారు. సాయి మురళీ, షేక్ మున్నాను అరెస్టు చేసి కారును సీజ్ చేసినట్లు సీఐ రాజశేఖర్ గౌడ్ వెల్లడించారు. అలాగే మునగాలపాడు ‘వై’ జంక్షన్ వద్ద చిన్న టేకూర్ కు చెందిన కొత్తూరు గోవర్ధన్, నన్నూరు గ్రామానికి చెందిన వెంకట నగేష్ కుమార్ తెలంగాణకు చెందిన 24 మన్షన్ హౌస్ బ్రాందీ సీసాలను రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. ఆటోతో సహా మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
బంగారుపేటలో సారా స్థావరాలపై దాడులు
సెబ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జానకీరామ్ ఆధ్వర్యంలో సెబ్ స్క్వాడ్ ఆధికారులతో కలసి బంగారుపేటలో వరుసగా మూడురోజులుగా నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించి 17,150 లీటర్ల బెల్లం ఊట, 565 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసి 90 కేజీ బెల్లంను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టుచేసినట్లు సెబ్ స్టేషన్ సీఐ రాజశేఖర్ గౌడ్ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై స్వామినాథన్, సోమశేఖర్, సిబ్బంది లీలామోహన్, పద్మనాభం, నరసింహులు, శాంతరాజు, నరసింహారెడ్డి పాల్గొన్నారు.