Breaking News

మట్టిమిద్దె కూలి ఐదుగురు మహిళల దుర్మరణం

మట్టిమిద్దె కూలి ఐదుగురు మహిళల దుర్మరణం

సారథి న్యూస్​, వనపర్తి: మట్టిఇంటి మిద్దె కూలి ఐదుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి వనపర్తి జిల్లా గోపాల్​పేట మండలం బుద్దారంలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా గోపాల్​పేట మండలం బుద్దారంలో విషాదఘటన జరిగింది. గ్రామానికి చెందిన నర్సింహ ఏడాది క్రితం చనిపోయాడు. ఆయన సంవత్సరీకం కోసం కొడుకులు, కోడళ్లు, మనవరాళ్లు గ్రామానికొచ్చారు. కార్యక్రమం ముగిసింది. ఉక్కపోతకు ఫ్యాన్ ఉందని 11మంది ఒకే గదిలో నిద్రపోయారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగా నానిపోయి ఉన్న మట్టిమిద్దె ఒక్కసారిగా కుప్పకూలి పక్కగదిలో నిద్రపోతున్న వారిపై పడింది. ఘటనలో ఇంటి యజమాని మణెమ్మ, ఆమె కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనుమరాళ్లు అశ్విని, పింకి మృత్యువాత పడ్డారు. మణెమ్మ కుమారుడు కుమార్​తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న డెడ్​బాడీస్​ను పోలీసులు గ్రామస్తుల సహకారంతో వెలికితీశారు.
బుద్దారం ఘటన దురదృష్టకరం: మంత్రి నిరంజన్​రెడ్డి
వనపర్తి నియోజకవర్గం గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో ఇల్లు కూలి ఐదుగురు మృతిచెందిన సంఘటనపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గ్రామానికి చెందిన ఇంటిపెద్ద కోమటిచెవ్వ నరసింహ సంవత్సరీకానికి వచ్చి ఏడాదిగా ఉపయోగంలో లేని ఇంట్లో ఉన్న కుటుంబీకులు దురదృష్టవశాత్తు మరణించడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు.