- కరోనాతో చేనేత, జౌళి పరిశ్రమ విలవిల
- గోదాముల్లో రూ.400 కోట్ల విలువైన వస్త్రాలు
- పెట్టుబడుల్లేక చేతులెత్తేస్తున్న మాస్టర్ వీవర్స్
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ప్రభావంతో రాష్ట్రంలోని చేనేత, జౌళి పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆయా రంగాల మీద ఆధారపడి పనిచేస్తున్న రెండున్నర లక్షల మంది కార్మికులు ఇప్పుడు రోడ్డునపడినట్లయింది. సాధారణంగా ఈ సీజన్‌లో పెండ్లిండ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా చేనేత, మరమగ్గాల కార్మికులకు చేతినిండా పని ఉంటుంది. కానీ కరోనా దెబ్బకు ఇప్పుడు ఒక్కటంటే ఒక్క మీటరు వస్త్రం కూడా తయారు చేయలేని దుస్థితి నెలకొంది. సుమారు రూ.400కోట్ల విలువైన వివిధ రకాల వస్త్రాలు గోడౌన్లలో మూలుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వస్త్ర దుకాణాలు, షాపింగ్ మాల్స్‌ను మూసేయడంతో వీటిని మార్కెట్‌కు తరలించలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా వస్త్రతయారీకోసం పెట్టుబడులు పెట్టిన మాస్టర్ వీవర్స్, యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా తాము పెట్టుబడులు పెట్టలేమంటూ వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే రాబోయే ఏడాది వరకూ కార్మికులకు ఉపాధి దొరికే అవకాశమే ఉండదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వస్త్రోత్పత్తి కేంద్రాలు వెలవెల
రాష్ట్రంలోని గద్వాల, పోచంపల్లి చీరలు, కరీంనగర్ బెడ్‌షీట్లు, వరంగల్ కార్పెట్ల తయారీకి ప్రసిద్ధి. ప్రస్తుతం ఈ కేంద్రాలన్నీ వస్త్రోత్పత్తులు లేక వెలవెలబోతున్నాయి. ఆయా ప్రాంతాల్లో పనులు కొనసాగినప్పుడే కార్మికుల జీవనం సాగించడం కష్టం. చాలీచాలని వేతనాలు, నెలవారీగా ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆ పనులు కూడా లేకపోవడంతో చేనేత, మరమగ్గం మీద పనిచేసే వారు అర్థాకలితో అలమటిస్తున్నారు.
ఆదుకోని ప్రభుత్వం
వీరిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం, టెస్కో (తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ) ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. బీపీఎల్ కుటుంబాలకు ఇచ్చే రూ.1500, 12 కిలోల బియ్యం తప్ప వీరికంటూ ప్రత్యేకంగా ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదని చేనేత కార్మికులు, నేతలు చెబుతున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండబోతుందని జౌళిరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో వస్త్ర దుకాణాలు, షాపింగ్ మాల్స్‌ను తెరిచేందుకు ఇప్పట్లో ప్రభుత్వం అనుమతులివ్వబోదని వారు చెబుతున్నారు. ఒకవేళ ఇచ్చినా వినియోగదారులు ఇంతకుముందులా ఎక్కువ మొత్తంలో వస్త్రాలను కొనుగోలు చేయకపోవచ్చన్నది వారి అంచనా. ఇది చేనేత, జౌళి రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
జీవోనెం.45 అమలు చేయాలి
లాక్‌డౌన్‌తో రాష్ట్రంలోని చేనేత, మరమగ్గం కార్మికులకు పూట గడవని పరిస్థితి నెలకొంది. వారందర్నీ ప్రభుత్వం ఆదుకోవాలి. మాస్టర్ వీవర్స్ పట్టించుకునే స్థితిలో లేరు కాబట్టి.. కార్మికులకు వడ్డీలేని రుణాలను ఇవ్వడం ద్వారా వారినే యజమానులుగా తీర్చిదిద్దాలి. జీవోనం.45 ప్రకారం పూర్తిస్థాయి వేతనాలు ఇప్పించాలి. తద్వారా కార్మికులకు కుటుంబాలను కాపాడాలి. గోదాముల్లో ఉన్న అన్ని రకాల వస్త్రాలనూ ప్రభుత్వమే కొనుగోలు చేసి.. చేనేత, జౌళి రంగాలను నిలబెట్టాలి.
– కూరపాటి రమేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్