సారథి న్యూస్, మెదక్: భావితరాల భవిష్యత్ బాగుండాలంటే తప్పకుండా మొక్కలు నాటాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా మంగళవారం హవేళి ఘనపూర్ మండలంలోని బూర్గుపల్లిలో కలెక్టర్ ఎం.ధర్మారెడ్డితో కలిసి ఆమె మొక్కలు నాటారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అందుకు అనుగుణంగా సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరుమొక్కలు నాటి రక్షించాలన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు.
కరోనా నివారణకు అందరూ మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించడంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలనే ముందు చూపుతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. హరితహారం విషయంలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ లావణ్యరెడ్డి, హవేళి ఘనపూర్ జడ్పీటీసీ సుజాత, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటేశం, ఎంపీడీవో సాయిబాబా, ఎంపీవో ప్రవీణ్ కుమార్, ఏవో రాజ్ కుమార్, మధుమోహన్ పాల్గొన్నారు.