- భారత్ కు గుడ్ బై చెప్పిన హార్లే డేవిడ్సన్
- 2009లో భారత మార్కెట్ లోకి ప్రవేశించిన కంపెనీ
న్యూఢిల్లీ : అధిక సామర్థ్యం ఉన్న ఇంజిన్ల (350 సీసీ) తో అత్యంత ఖరీదైన బైకులను తయారుచేసే హార్లే డేవిడ్సన్ భారత్ లో బైక్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పింది. అమ్మకాలు లేకపోవడంతో భారత్ నుంచి ఆ కంపెనీ బిచాణా ఎత్తేసింది. కోవిడ్ ప్రభావంతో కొత్త బైకులపై ఆ సంస్థ పెడుతున్న పెట్టుబడులకు ఆశించిన లాభాలు రావడం గగనమైంది. ఇక భారత్ లో అయితే కోవిడ్ కంటే ముందునుంచే డేవిడ్సన్ బైకులు అమ్ముడుపోవడం లేదు. గతేడాది 2,500 హార్లే డేవిడ్సన్ బైకులు మాత్రమే అమ్ముడుపోగా.. ఏప్రిల్- జులై మధ్య కాలంలో 150 కూడా అమ్ముడవలేదు. దీంతో తీవ్రనష్టాల బారిన పడుతుండడంతో ఆ సంస్థ పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలోనే భారత్ లో ఉత్పత్తులను నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు హర్యానాలో ఉన్న ఒక్కగానొక్క యూనిట్ ను మూసేసింది. 70 మంది దాకా అక్కడ పనిచేస్తున్నారు. వారందర్నీ ఉద్యోగాల నుంచి తొలగించారు. కాగా, మూడు నాలుగేండ్లలో.. జనరల్ మోటార్స్, ఫియట్, సాన్యాంగ్, స్కానియా, యూఎం మోటార్ సైకిల్స్ వంటి సంస్థలు భారత్ నుంచి నిష్క్రమించాయి. హార్లే డేవిడ్సన్2009లో భారత మార్కెట్ లోకి ప్రవేశించింది. దశాబ్దకాలంలోనే నిష్క్రమించాల్సి వచ్చింది.