Breaking News

బీసీసీఐ x ఐసీసీ

–పన్ను మినహాయింపుపై వైరం

ముంబై: బీసీసీఐ, ఐసీసీ మధ్య ఎన్నాళ్లుగా ఉంటున్న వైరం మరోసారి రాజుకుంది. భారత్ ఆతిథ్యమిచ్చే 2021 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే వరల్డ్​ కప్​కు సంబంధించి పన్ను మినహాయింపు విషయంలో రెండు బోర్డుల మధ్య జరుగుతున్న గొడవ మరింత ముదిరింది. పన్ను మినహాయింపుకు సంబంధించి గ్యారెంటీ లెటర్ ఇవ్వాలని చాలా రోజులుగా ఐసీసీ.. బీసీసీఐని అడుగుతోంది. దీనికి సంబంధించిన తుది గడువు కూడా ముగియడంతో ఇప్పుడు అంతర్జాతీయ బాడీ రంగంలోకి దిగింది. పన్ను మినహాయింపుకు సంబంధించి ఇప్పటివరకు తీసుకున్న చర్యలకు ఆధారాలను చూపించాలని ఐసీసీ లీగల్ హెడ్ జొనాథన్ హాల్.. బీసీసీఐకి ఈ మెయిల్ పంపడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై బీసీసీఐ కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వివాదం తారాస్థాయికి వెళ్లింది. అయితే గత రెండు నెలలుగా లాక్డౌన్ ఉండటం, కేవలం కరోనాకు సంబంధించిన అంశాలపైనే కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించడంతో పన్ను మినహాయింపు అంశాన్ని పక్కనబెట్టేశారు. దీంతో తుది గడువు ప్రకారం లెటర్ గ్యారంటీ ఇవ్వలేమని బీసీసీఐ ‘ఫోర్స్ మెజ్యూర్’ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితులను పట్టించుకోని ఐసీసీ… బీసీసీఐని మరింత ఇబ్బందుల్లోకి నెడుతూ తదనంతర చర్యలకు ఉపక్రమించింది.

‘ఆతిథ్య అగ్రిమెంట్​లోని 20.1 (క్లాజ్ ఏ) ప్రకారం బీసీసీఐ బాధ్యతను గుర్తుచేశాం. దీనిని నెరవేర్చని క్రమంలో 2020 మే 18 తర్వాత ఏ సమయంలోనైనా ఆతిథ్య అగ్రిమెంట్​ను రద్దుచేసే అధికారాలు ఐసీసీ బిజినెస్ కార్పొరేషన్​కు ఉంది’ అని లేఖలో పేర్కొంది. అన్ని అవకాశాలను పరిశీలించిన తర్వాత రెండు మెగా ఈవెంట్లను రద్దుచేస్తామని హెచ్చరించింది. అయితే లెటర్ గ్యారంటీ తుది గడువును పెంచాలని బీసీసీఐ కోరినా.. ఐబీసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ప్రపంచం మొత్తం కరోనాతో ఇబ్బందులు పడుతున్న వేళ.. తుది గడువు పెంచకపోవడానికి కారణాలేంటో తెలియడం లేదని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ‘ఐసీసీలో సభ్యత్వం ఉన్న బోర్డులకు చెందిన వారే ఐబీసీలో డైరెక్టర్లుగా ఉంటారు. మరి గడువు పొడిగించకపోవడానికి వారంతా ఒప్పుకున్నారా? దానికి సంబంధించిన డాక్యుమెంట్స్​పై సంతకాలు చేశారా? చేస్తే దానిని మాకు చూపించండి’ అని బీసీసీఐ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. తాము ఎలాంటి డాక్యుమెంట్లపై సంతకాలు చేయలేదని ఇప్పటికే ముగ్గురు డైరెక్టర్లు స్పష్టంచేశారు. దీంతో ఐసీసీ రాజకీయ డ్రామాకు తెరలేపిందని బీసీసీఐ ఆరోపిస్తున్నది. ఎన్నికల ముందు ఐసీసీ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించింది. ముగ్గురు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారని, ఈ మోస్తాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉందని వాదిస్తున్నాయి.
సామరస్యంగా పరిష్కరించుకుంటాం: ఐసీసీ
ఈ వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటామని ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. జొనాథన్ హాల్ మెయిల్​పై ఆయన భిన్నంగా స్పందించారు. పన్ను మినహాయింపు విషయంలో ఇరు బోర్డులు కలిసి పనిచేస్తాయని, ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా చర్చలు జరుపుతాయన్నారు. ఆతిథ్య అగ్రిమెంట్​లో ఉన్న స్పష్టమైన నిబంధనల ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. దీనివల్ల భవిష్యత్​లోమరిన్ని పెట్టుబడులు వచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు.