సారథి న్యూస్, మెదక్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మెదక్ జిల్లాకు గడ్డం శ్రీనివాస్ ను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గడ్డ శ్రీనివాస్ పార్టీలో కార్యకర్తస్థాయి నుంచి జిల్లా అధ్యక్ష స్థాయి వరకు ఎదిగారు. గతంలో ఉమ్మడి మెదక్ మండలాధ్యక్షుడిగా మూడుసార్లు, మెదక్ ఉమ్మడి జిల్లా వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా అధిష్టానం మెదక్ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చింది.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాలో పార్టీ పటిష్టతకు చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే పట్లొళ్ల శశిధర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు, రాష్ట నాయకులు ఆకుల రాజయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.