సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా విపత్తు కింద తెల్లరేషన్ కార్డుదారులకు ప్రకటించిన రూ.1500 ఆర్థిక సాయం పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి రేషన్ బియ్యం తీసుకోని వారికి రూ.1500 నగదు సాయం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 8.26 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు కరోనా నగదు సాయానికి దూరం కానున్నారు. తొలుత రాష్ట్రంలోని మొత్తం 87.54 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ నగదు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏప్రిల్‌లో పంపిణీ ప్రారంభమైంది. దీనికోసం ప్రభుత్వం రూ.1314 కోట్లు విడుదల చేసింది. ఇందులో 74.07 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 1,111.08 కోట్ల మేర పంపిణీ చేశారు. ఇంకా 13.47 లక్షల మంది పంపిణీ చేయలేదు. వీరికి ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ కాకపోవడంతో నగదు బదిలీని పెండింగ్‌లో పెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరికి పోస్టాఫీసు సేవింగ్ ఖాతాల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు లబ్ధిదారుల పోస్టల్ అకౌంట్లు సేకరించి 5.21 లక్షల మందికి శనివారం నగదు పంపిణీ ప్రారంభించారు. ఇలా 52 వేల మంది రూ.1,500 చొప్పున పోస్టాఫీసుల ద్వారా డ్రా చేసుకున్నారు.
వారికి మొండిచేయి..
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కరోనా ప్యాకేజీ కింద తొలుత ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, కార్డుకు రూ.1500 చొప్పున ప్రకటించగా.. 79.57 లక్షల మంది రేషన్ కార్డుదారులు(91 శాతం) బియ్యం తీసుకున్నారు. నగదు పంపిణీకి వచ్చేసరికి మాత్రం తేడాలొచ్చాయి. 74,07,186 కుటుంబాలకు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేశారు. తాజాగా 5,21,641 కుటుంబాలకు పోస్టాఫీస్ ద్వారా పంపిణీ చేస్తున్నారు. దీంతో కరోనా ఆర్థిక సహాయం పొందేవారి సంఖ్య 79,28,827కు చేరుతుంది. ఇంకా 8.26 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం నిలిపివేశారు. వీరు గత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో బియ్యం తీసుకోనందుకు వీరిని ఆర్థిక సాయానికి అనర్హుల జాబితాలో చేర్చారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి రూ.123.90 కోట్లు ఆదా అవుతున్నాయి. కాగా రేషన్‌కార్డులు ఉండి, బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాని వారికి సమీపంలోని పోస్టాఫీసుల్లో రూ.1500 నగదు తీసుకోవడానికి అవకాశం ఇచ్చామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.