Breaking News

బోరు గుంతే మృత్యువైంది

  • బోరుబావిలో పడ్డ బాలుడి మృతి
  • 8:30 గంటలు శ్రమించిన రెస్క్యూ టీమ్

సారథి న్యూస్, మెదక్: బోరు బావి బాలుడిని మింగేసింది.. గుంతలో పడ్డ చిన్నారి విగతజీవిగా మారాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చాన్ పల్లి గ్రామానికి చెందిన భిక్షపతి పంట సాగుకోసం తన పొలంలో మంగళవారం రాత్రి బోరు వేయగా ఫెయిల్ అయింది. దీంతో బుధవారం పొలంలో మరో రెండుచోట్ల బోర్లు వేయించాడు. వాటిలో కూడా చుక్కనీరు పడలేదు. బోరు వేస్తున్నారని చూసేందుకు అక్కడికి వచ్చిన భిక్షపతి, అతని కూతురు నవీన, అల్లుడు గోవర్ధన్, ముగ్గురు మనవళ్లు సాయంత్రం 5 గంటల తర్వాత ఇంటికి వెళ్లారు.

ఈ క్రమంలో భిక్షపతి చిన్న మనవడు సంజయ్ సాయివర్ధన్(3) ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. మట్టి కుప్పపైకి ఎక్కడంతో జారి గుంతలో పడ్డాడని తాత భిక్షపతి తెలిపారు. అయితే హైదరాబాద్, గుంటూరు నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు డీఎస్పీ సెంథిల్​ కుమార్​ నేతృత్వంలో 8:30 గంటల పాటు తీవ్రంగా శ్రమించాయి. ఎట్టకేలకు బోరుబావిలో పడిన బాలుడిని బయటకుతీశాయి. కాగా 11:30 గంటల పాటు గుంతలో ఉండడంతో ఆక్సిజన్​ అందక బాలుడు మృతిచెందాడు. రెస్క్యూ ఆపరేషన్​ పూర్తయ్యే వరకు మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సంఘటన స్థలంలోనే ఉన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అనుమతి లేకుండా బోరు వేసిన రిగ్గు యజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు. బోర్లు ఫెయిల్ అయితే వాటిని వెంటనే పూడ్చివేయాలని ఎమ్మెల్యే రైతులకు సూచించారు. ఈ విషయంలో రిగ్గు యజమానులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు.