సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): లోకకల్యాణం కోసం శ్రీశైలక్షేత్ర పాలకుడైన బయలు వీరభద్ర స్వామి వారికి మంగళవారం విశేషపూజలు జరిపించారు. బయలు వీరభద్రస్వామి వారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైల క్షేత్రపాలకుడిగా క్షేత్రానికి ప్రారంభంలో ఆరుబయట ఉండి, ఎలాంటి ఆచ్చాదన, ఆలయం లేకుండా దర్శనమిస్తాడు. ప్రసన్నవదనంతో కిరీట ముకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి కుడివైపున దక్షుడు, ఎడమవైపున భద్రకాళి దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని, వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి ముఖ్యంగా ఆగమసంప్రదాయంలో క్షేత్రపాలక పూజకు చాలా విశిష్టత ఉంది. క్షేత్రపాలకుడికి పూజలు చేయడం ద్వారా క్షేత్రంలో భక్తులు ఎలాంటి భయం బాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. మంగళవారం, ఆదివారం, అమావాస్య రోజుల్లో చేసే వీరభద్రపూజ అనేక ఫలితాలు ఇస్తుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పూజాదికాల్లో పంచామృతాలు, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ బయలు వీరభద్రస్వామి వారికి విశేషఅర్చనలు జరిపించామని ఈవో రామారావు తెలిపారు.
- September 8, 2020
- Archive
- ఆధ్యాత్మికం
- EO RAMARAO
- SRISAILAM
- VEERABADRA SWAMY
- ఈవో రామారావు
- వీరభద్రస్వామి
- శ్రీశైలం
- Comments Off on బయలు వీరభద్రస్వామికి అభిషేకం