Breaking News

బంధం.. బాధ్యతలు.. ఎన్నో ప్రశ్నలు

బంధం.. బాధ్యతలు.. ఎన్నో ప్రశ్నలు

బంధం, బాధ్యతలు, చుట్టూ సవాళ్లు.. ఇదీ ఇప్పుడు కుటుంబాలను కుంగదీస్తున్న తీరు. ఈ చట్రంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు… పెరుగుతున్న కలహాలు ఎన్నో ప్రశ్నలను ఉదయిస్తున్నాయి. కుటుంబం పునాదులను కూల్చేస్తున్నాయి. ప్రేమ సాక్షిగా వెలగాల్సిన మనుషులు దానికి వింత భాష్యాలు చెప్పుకుంటూ మానవత్వానికే మచ్చతెస్తున్నారు. అన్నీ అమరి ఉన్నా ఇంకా ఏదో చాలదన్న భావన. పొరుగింటి పుల్లకూర రుచి అనే నైజం.. తాను సుఖపడితే చాలు మిగతా అంతా తర్వాత సంగతి అనే విచిత్ర ధోరణి వెరసి స్త్రీ పురుష సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. పెళ్లంటే పందిళ్లు, సందళ్లు.. తప్పెట్లు తాళాలూ మొత్తం కలిపి నూరేళ్లూ.. అనే పాటలు మాయమై.. పెళ్లి ఒకరితో, ప్రణయం మరొకరితో, ప్రేమ ఇంకొకరితో అనే పెడధోరణలు ప్రబలి పచ్చని కాపురాల్లో విచ్చు కత్తులు పారుతున్నాయి. అమాయకులను బలిచేస్తున్నాయి. ఒక సంఘటన మార్పు తేవడం లేదు. ఒక క్రైం కథనం మరో కిరాతకానికి థ్రెడ్‌ స్టోరీ అవుతోంది.


కలచివేసిన ఆ రెండు సంఘటనలు
శంషాబాద్‌ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్​లహరి ఎన్నో ఆశలతో కుటుంబ జీవితంలోకి అడుగుపెట్టింది. ఆర్థిక స్థితి లోపం లేదు. ఆమె అందమూ తక్కువ కాదు. ఇక మమతలు పంచుతూ దాన్నే తన భర్త నుంచి కోరుకుంది. అతనికి పైత్యం ప్రకోపించి హింసించేవాడు. నోరులేని వారింటి కుక్క రక్షణే ఆమెకు చాన్నాళ్లు తోడైంది. తల్లిదండ్రులకు మనస్తాపం ఎందుకనీ ఆమె తన బాధను పెదవి దాటనివ్వలేదు. గుండెల్లో బాధల లావా పొంగుతున్నా అదిమి పెట్టుకుంది. సర్వస్వమని భర్తను ప్రేమించింది ఎప్పటిలాగే. అదే పిచ్చిలో భ్రమించింది. చివరికి అతను పెచ్చుమీరాడు. కట్టుకున్నామెకు కడుపు పండలేదని…మరో ఆమెను వలచాడు. ఆ చేష్టలు చాటు తొలగి ఆమెనే చివరికి భార్య అర్తించింది. అయినా వారు కరగ లేదు. ఇక అత్తామామలు, కొడుకు పక్షమే. ఇక లహరికి మిగిలింది ఒంటరితనం. భరించలేని బాధ. అన్నీ చెప్పి ఈ లోకాన్ని వదిలింది. ఆమె కలల సౌధం కూలింది.


మూడుముక్కలాట
తాజా సంఘటన ఓ చిన్నారి జీవితాన్ని చిదిమేసింది. తన పనిచేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఓ భర్త జీవితం అయోమయంలో పడింది. ఇది మూడురోజుల క్రితం సంఘటన. ఇది 9 ఏళ్ల వైవాహిక జీవితంలో వచ్చిన సంక్షోభం. అనంతపురం జిల్లాకు చెందిన ఆమె, హైదరాబాద్​కు చెందిన అతను ఫేస్‌బుక్‌ సాక్షిగా ప్రేమించుకున్నారు. 9 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. వారికి చక్కని చిన్నారి(8) కానీ ఆమె జీవితంపై తల్లి స్నేహితుడు కాలయముడయ్యాడు. అతను పరిచయమైంది ఓ మొబైల్‌ షాపులో. అది ఇంటి వరకూ.. ఇంకా పరిధి దాట వెళ్లింది. వారికి మళ్లీ మూడో మనిషి. ఆమె అతడినీ చేరదీసింది. ఇది మొదటి స్నేహితుడికి నచ్చలేదు. ఇద్దరూ ఉన్న వారింటికే వచ్చి అకారణంగా ఆమె కూతుర్ని బలిగొన్నాడు. ఈ సంఘటనలన్నీ పోలీసులు చెప్పేవరకూ ఆమె భర్తకు తన ఇంట్లో జరుగుతున్న మూడుముక్కలాట తెలియదు. తెలిసే సమయానికి ముద్దుల కూతురు రక్తపు మడుగులో‘నాన్నా బాయ్‌’ అంటూ వెళ్లి పోయింది. భార్య నిర్వాకం నిస్తేజుడిని చేసింది.


గుణపాఠాలు ఎప్పుడు?
ఇదీ అసలు ప్రశ్న. తమ సంబంధాలు కాపురాలను కూల్చుతున్నా ఎవరూ మారడం లేదు. పెద్దలు ఉంటే రక్షణ అని భావించకుండా వారిని భారంగా భావించి తమ ఇళ్లకే రానీయడం లేదు. ఆధునికత వినియోగం తమను దహిస్తూ ఉన్నా లెక్కచేయడం లేదు. ఉన్నదానికి తృప్తి పొందని స్థితిలో లేనిదానికి అర్రులు చాస్తున్నారు. ఇక్కడ కొన్ని అధిక సంఘటనల్లో మహిళలు బలవుతుంటే తాజాగా ఈ జాబితాలోకి పురుషులూ చేరుతున్నారు. వీటిన్నింటికీ కారణం వైవాహిక జీవితాన్ని కాదని పెట్టుకుంటున్న సంబంధాలు. అవతల వారు విసిరే ఆశల వలలు. తమ స్థితికి మించి ఉండాలనుకునే భావన. దీనికోసం రహదారులు కాకుండా అడ్డదారులు వెతుకుతున్నారు. తీపి మాటలు, విషపు గుళికలవుతున్నాయి. ప్రేమ పాశాలు, మృత్యు మార్గాలవుతున్నాయి. ఖైదీ బాట పట్టనిస్తున్నాయి. పరివర్తన మాత్రం ప్రశ్నార్థకమే అవుతోంది. నైతికత మృగ్యమవుతోంది. చీకటి సంబంధాలు కుటుంబాల్లో వెలుగులను చిదిమేస్తున్నాయి. పెంపకాల్లో మార్పులు, పెద్దల సాంగత్యం, అంతకు మించి బలహీనతలను అధిగమించే నిబ్బరత నేర్చుకోవాలిన చెబున్నాయి. ఎవరు ఎవరినీ మోసం చేస్తున్నా ఇద్దరూ నష్టపోతున్నారనే వాస్తవాన్ని గుర్తించడం లేదు. అమాయకులైన చిన్నారుల జీవితాలకు ఇవి ముప్పు తెస్తున్నాయి. ఇకనైనా మనమంతా మారాలి.


:: పట్నాయకుని వెంకటేశ్వరరావు,
సీనియర్​ జర్నలిస్టు,
సెల్​నం.97053 47880,
97047 72790