Breaking News

ఫెమ్యూర్ బోన్ సర్జరీ

తుంటి ఎముక కీలు శస్త్రచికిత్స

మానవ శరీర భాగాల్లో ఎముకలు ఎంత పటిష్ఠంగా ఉంటే అంత సమర్థవంతంగా పని చేయగలుగుతారు. ముఖ్యంగా అన్ని ఎముకల్లోకి బలమైంది, అధిక బరువు మోయగలిగేది తొడ భాగాల్లో ఎముకలు(తుంటి ఎముకలు). ఇవి తుంటి భాగానికి అతుక్కుని ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, లేదా అధిక శ్రమతో కీళ్లు అరిగిపోయి ఎముకలో పట్టు తగ్గినా దాన్ని సర్జరీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థరైటిస్, రొమిటో ఆర్థరైటిస్ బారినపడిన వాళ్లకు ఒక్కోసారి ఈ సర్జరీ అవసరమవుతుంది.తుంటి కీలు శస్త్రచికిత్స తర్వాత కూడా జీవితం సాఫీగా కొనసాగే అవకాశం ఉంది. ఇంతకుముందు ఇలాంటి సర్జరీలు ఉండేవి కావు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా ఈ శస్త్రచికిత్స సాధ్యమవుతోంది. చిన్నకోతలు, తక్కువ నొప్పితో కండరాలు దెబ్బతినకుండా వీలైనంత త్వరగా పేషెంట్ కోలుకునే అవకాశం ఉంది.

ఈ అంశాల గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గుడులూరు మనోజ్​ కుమార్ వివరంగా చెప్పారు.
సర్జరీ ఎలా చేస్తారు? ఈ సర్జరీని తుంటి ఎముక కీలు ముందు భాగం నుంచి చేస్తారు. ఎందుకంటే తుంటి ఎముకకు దగ్గరగా ఉండే ప్రాంతమది. కాబట్టి నేరుగా శస్త్రచికిత్స చేయొచ్చు. ఎలాంటి పెద్దకోతలు లేకుండా, కండరాలు దెబ్బ తినకుండా ఈ ఆపరేషన్​ పూర్తవుతుంది. రక్తస్రావం కూడా పెద్దగా ఉండదు. పెయిన్ కూడా తక్కువగా ఉండి పేషెంట్ త్వరగా కోలుకునే అవకాశం ఉంది.

ఇవీ ఉపయోగాలు
ఇండియాలో ఈ సాంకేతికత ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అదే యూరప్​లో 1930 నుంచీ ప్రాక్టీసు చేస్తున్నారు. అనేక పరిశోధనల్లో తుంటి ఎముక భాగంలో చిన్న కోతల శస్త్రచికిత్స సత్ఫలితాలను ఇస్తున్నట్టు రుజువైంది. అంతేకాదు పేషెంట్ తక్కువ సమయంలోనే కోలుకునే అవకాశం ఉంది. పాత పద్ధతుల్లో చేసే శస్త్ర చికిత్సతో పోలిస్తే ఈ సర్జరీ ద్వారా పేషెంట్ వెంటనే కోలుకుని సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. మరో పరిశోధనలో పాతపద్ధతుల్లో ఎంఆర్ఐ చేసిన సంవత్సరం తర్వాత మొత్తం తుంటి ఎముక సర్జరీ చేసేవారు. అదే చిన్న కోతల సర్జరీ ద్వారా అంత సమయం పట్టదు. ఈ సాంకేతికత వల్ల కండరాలు దెబ్బ తినకపోవడంతో పేషెంట్ పిరుదుల భాగం సహజంగా ఉంటుంది.

డాక్టర్ గుడులూరు మనోజ్​ కుమార్,
ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్

సర్జరీ సురక్షితమేనా?
ఈ ఆపరేషన్​ చాలా సురక్షితమైందనే చెప్పొచ్చు. దీనివల్ల చాలా తక్కువ అవలక్షణం కలుగుతుంది. ఎందుకంటే పూర్వ పద్ధతుల్లో చేసే ఈ సర్జరీ వల్ల కీళ్లు స్థానభ్రంశం జరిగి రెండుకాళ్ల పొడవులో తేడా వస్తుండేది. రెండూ ఒకే పొడవు ఉండకపోవడంతో పేషెంట్ నడకలో వ్యత్యాసం కనిపించేది. ఒక కాలు పొట్టిగా, ఒక కాలు పొడవుగా అయ్యేది. సరైన కొలతలతో చేస్తారు కాబట్టి ఈ సర్జరీ వల్ల అలాంటి అవకాశం కలుగదు. ప్రతి ప్రక్రియకు ఎక్స్​ రే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్జరీ చేసే సమయంలో కీళ్లు స్థానభ్రంశం కావడానికి వీలుండదు. ఆఖరి వరకూ ఎలాంటి లోపం రాదు. కాబట్టి ఈ సర్జరీ విజయవంతంగా చేయొచ్చు. అందువల్ల ఈ సర్జరీ సురక్షితమైనదే అనొచ్చు.
ఎక్స్​పర్ట్​లే చేయాలి
కొత్త డాక్టర్ కంటే పాత కాంపౌండర్ మేలంటారు. ఎందుకంటే ఏదైనా అనుభవం వల్లే మేలైన చికిత్స సాధ్యం అవుతుంది కాబట్టి. అందుకే ఈ సర్జరీని ప్రతి సర్జన్ సరిగ్గా చేయలేకపోవచ్చు. కీలుమార్పిడి సర్జరీలో ప్రావీణ్యులైన వారు మాత్రమే దీనికి చేయగలరు. పూర్తి సాంకేతికత తెలిసిఉండాలి. సురక్షితమైన శస్త్ర చికిత్స చేయడానికి అనేక ట్రిక్స్ ఉపయోగించి చేయాల్సి ఉంటుంది. పైగా ఇది ఇండియాలో కొత్త ప్రయోగం. కొన్ని ఏళ్లు గడిస్తేనే కాని ఈ సర్జరీ ఇక్కడ ప్రాముఖ్యత సంతరించుకోదు. దీనివల్ల పేషెంట్లకు ప్రయోజనం కలుగుతోంది కాబట్టి ప్రతి బోన్ సర్జన్ ఈ సర్జరీని తప్పక తెలుసుకోవాలి, నేర్చుకోవాలి.
ప్రమాదాలున్నాయా?
ఈ చికిత్స విధానం ద్వారా ప్రమాదాలు దాదాపు లేనట్టే. రెండుకాళ్ల పొడవులో అసమానతలు ఉండవు. కీళ్ల స్థానభ్రంశం జరగదు. దీంతో ఎలాంటి అవలక్షణం రాదు. అయితే సర్వ సాధారణమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కీలుమార్పిడి శస్త్రచికిత్సలో చీము రావడం, రక్తం గడ్డకట్టడం లాంటి అతి సాధరణమైన సమస్యలు ఉంటాయి. వీటిని మెడిసిన్స్​తో అరికట్టవచ్చు. ఆరోగ్యకరమైన వ్యక్తికి అవికూడా రాకపోవచ్చు. ప్రస్తుతం ఈ సర్జరీలు అంతర్జాతీయ స్థాయి ఐసీయూ, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థ ఉన్న ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా పేషెంట్ అంటువ్యాధులకు గురికాకుండా సురక్షిత వాతావరణంలో ఉంచి సర్జరీ నిర్వహించాలి.
సర్జరీ తర్వాత
ఈ సర్జరీ జరిగాక మరుసటి రోజే పేషెంట్ ఇంటికి వెళ్లిపోవచ్చు. హాస్పిటల్లో ఉన్నప్పుడు పాటించే వైద్య షరతులు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పాటించాలి. సర్జరీ సమయంలో ఒకటి రెండు రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది.

:: శ్రీ