Breaking News

ప్రభుత్వ ఆఫీసులకు ఆ రంగులు మార్చాల్సిందే..

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సారథి న్యూస్​, అమరావతి: కరోనా కారణంగా విధించిన లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత మూడు వారాల్లోగా గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ ఆఫీసులకు వైఎస్సార్ ​సీపీ జెండా రంగులు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విధంగా చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీ ఆఫీసుకు వైఎస్సార్​సీపీ జెండా రంగులు వేయడాన్ని సవాల్‌ చేస్తూ ఎం.వెంకటేశ్వర రావు, విశాఖ జిల్లాకు చెందిన మరొకరు వేసిన పిల్స్‌పై గతంలో హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వాఫీసులకు ఏ రాజకీయ పార్టీ జెండా రంగులు వేయరాదని, వైఎస్సార్ ​సీపీ జెండా రంగులను తీసేయాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు అమలుకు నాలుగు వారాల సమయం కావాలని ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. పదివేలకుపైగా భవనాల రంగులు తీసేందుకు నాలుగు వారాల సమయం కావాలని అదనపు ఏజీ పి.సుధాకర్‌రెడ్డి కోరారు. లాక్‌ డౌన్‌ ఎత్తేసిన తర్వాత మూడు వారాల్లోగా రాజకీయపార్టీల జెండా రంగులను  ప్రభుత్వ ఆఫీసులపై తొలగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా చేశాకే స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

One thought on “ప్రభుత్వ ఆఫీసులకు ఆ రంగులు మార్చాల్సిందే..”

Comments are closed.