Breaking News

ప్రణబ్ ముఖర్జీ మృతి దేశానికే తీరని లోటు

ప్రణబ్ ముఖర్జీ మృతి దేశానికే తీరని లోటు

సారథి న్యూస్, మెదక్: భారతదేశ మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటని, ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రజాప్రతినిధులు కొనియాడారు. శనివారం మెదక్ కలెక్టరేట్ లో జడ్పీ చైర్​పర్సన్​ ర్యాకల హేమలత అధ్యక్షతన జడ్పీ జనరల్​ బాడీ మీటింగ్ ​నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతికి నివాళులర్పిస్తూ.. మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఎప్పటికీ గుర్తించుకుంటారని అన్నారు. తెలంగాణ బిల్లు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడే ఉభయసభల్లో ఆమోదం పొందిందని గుర్తుచేశారు. అలాగే దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటని, తనకు ఆయనతో 20 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి మాట్లాడుతూ.. ప్రణబ్​ముఖర్జీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మన మధ్య లేకపోవడం బాధాకరమని విచారం వ్యక్తంచేశారు. సమావేశంలో మెదక్ జిల్లా ఇన్​చార్జ్​కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జడ్పీ వైస్ చైర్​పర్సన్​ లావణ్యరెడ్డి, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.