Breaking News

పోరాడి ఓడిన కోహ్లీసేన

పోరాడి ఓడిన కోహ్లీసేన

సిడ్నీ: ఆసీస్‌ టూర్​లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. కోహ్లీసేన చివరిదాకా పోరాడినా పరాజయం తప్పలేదు. ఆసీస్‌ విధించిన 375 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులకే ఓటమి పాలైంది. టీమిండియా ఆటగాళ్లలో హార్దిక్‌ పాండ్యా(90; 76 బంతుల్లో 4×7, 6×4), శిఖర్‌ ధావన్‌(74; 86 బంతుల్లో 4×10) పోరాటం సాగించారు. టీమిండియా ఇన్నింగ్స్‌ను మయాంక్‌ అగర్వాల్‌, శిఖర్‌ ధావన్‌ ధాటిగా ప్రారంభించారు. హజిల్‌వుడ్‌ వేసిన ఆరో ఓవర్‌ రెండో బంతికి మయాంక్‌(22) ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కోహ్లి 21 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే ఓవర్‌ ఐదో బంతికి అయ్యర్‌(2) కూడా పెవిలియన్​చేరుకున్నాడు. కేల్ రాహుల్‌(12) కూడా వెంటనే వెనుదిరిగాడు. హార్దిక్‌, ధావన్‌ ద్వయం చాలా సేపు స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఈ క్రమంలో 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు హార్దిక్‌ పాండ్యా. జంపా బౌలింగ్​లో హార్దిక్‌ ఔటయ్యాడు. దీంతో టీమిండియా 247 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఐదో వికెట్‌గా ధావన్‌ పెవిలియన్‌ చేరగా, పాండ్యా ఆరో వికెట్‌గా ఔటయ్యాడు. అనంతరం రవీంద్ర జడేజా(25) పరుగులు చేయగా, నవదీప్‌ సైనీ 29 పరుగులు చేశాడు.
సెంచరీల మోత
తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ జట్టులో ఫించ్‌(114;124 బంతుల్లో 4×9, 6×2), స్టీవ్‌ స్మిత్‌(105; 66 బంతుల్లో 4×11, 6×4), డేవిడ్‌ వార్నర్‌(69; 76 బంతుల్లో 4×6) బ్యాట్లతో మెరుపులు మెరిపించడంతో ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆదివారం ఇదే వేదికపై రెండో వన్డే జరగనుంది. భారత్‌, ఆస్ట్రేలియా వన్డే సీరిస్​లో భాగంగా సిడ్నీవేదికగా జరిగిన వన్డేకు 50శాతం మంది ప్రేక్షకులకు అనుమతిచ్చారు.