న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి రష్యాలోని మాస్కోకు వెళ్లిన ఎయిరిండియా వందేభారత్ ఫ్లైట్‌ను అధికారులు వెనక్కి పిలిపించారు. ప్యాసింజర్లు లేకుండానే ఖాళీ ఫ్లైట్ శనివారం ఢిల్లీకి చేరింది. పైలెట్‌కు కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన అధికారులు ఉజ్బకిస్తాన్ నుంచి ఫ్లైట్‌ను వెనక్కి పిలిపించారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఏ-320 నియో(వీటీ–ఈఎక్స్‌ఆర్) మాస్కోలోని మన వాళ్లను తీసుకొచ్చేందుకు ఏర్పాటుచేశారు. ఫ్లైట్ స్టార్ట్ అయ్యేముందు సిబ్బందికి కరోనా టెస్టులు చేయగా..
పైలెట్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే పొరపాటున పాజిటివ్ బదులు నెగటివ్ వచ్చిందని చెప్పడంతో అతను డ్యూటీ ఎక్కాడని అధికారులు చెప్పారు. ఆ తర్వాత వెంటనే సరిచూసుకుని ఫ్లైట్‌ను వెనక్కి తెప్పించామని, సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్‌లో ఉంచామన్నారు. ప్యాసింజర్ల కోసం మరో ఫ్లైట్‌ను ఏర్పాటుచేసి పంపించారు. ట్రావెల్ బ్యాన్ కారణంగా విదేశాల్లో చిక్కకున్న మనవాళ్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటుచేసింది. దీంట్లో భాగంగానే ఆయా దేశాలకు ఫ్లైట్లను ఏర్పాటు చేసి.. సిబ్బందికి కరోనా టెస్టులు చేసిన తర్వాత డ్యూటీలకు అనుమతిస్తుంది.