సారథి న్యూస్, పుట్టపర్తి: అనంతరపురం జిల్లా పుట్టపర్తి పట్టణం ఒక్కసారిగా కరోనాతో కలవరపడింది. ప్రశాంతి నిలయం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ కు వైద్యారోగ్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ తేలడంతో గురువారం ఆయనను బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి అధికారులు తరలించారు. ట్రెయినీ కలెక్టర్ జాహ్నవి తహసీల్దార్ ఆఫీసులో అధికారులతో సమీక్షించారు.
గోపురం గేట్ నుంచి హనుమాన్ సర్కిల్ వరకు దాదాపు వెయ్యి ఇండ్ల పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించారు. ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో ఆమె చర్చించారు. సదరు కానిస్టేబుల్ తో సంబంధం ఉన్న ఆరుగురిని క్వారంటైన్ కు తరలించారు. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వారికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులు, మందులను తామే అందజేస్తామన్నారు.
28 రోజులు అనంతరం పరిస్థితిని బట్టి రెడ్ జోన్ ను రద్దుచేస్తామని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు. సమావేశంలో కరోనా జిల్లా ప్రత్యేకాధికారి చైతన్య, స్థానిక ప్రత్యేక అధికారి రాము, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీవో నరేష్ కృష్ణ, డీఎస్పీ రామకృష్ణయ్య, డాక్టర్ నాగరాజు నాయక్, అజయ్ కుమార్ రెడ్డి, కమిషనర్ రవి పాల్గొన్నారు.