Breaking News

పాపం తమ్ముళ్లు!

పాపం తమ్ముళ్లు!


సారథి న్యూస్, హైదరాబాద్: ఏపీ టీడీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఆ పార్టీ విధానం ఏమిటో కూడా అర్థం కాక తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే అధికార వైఎస్సార్​సీపీ టీడీపీపై దాడికి పదునుపెట్టింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను దూరం చేసి తమ వైపునకు తిప్పుకొంటోంది. మరోవైపు నాయకులపై కేసులు పెడుతోంది. ఇలాంటి తరుణంలో అధికార పార్టీని బలంగా ఢీకొనాలని టీడీపీ కూడా తమ విమర్శలకు పదును పెడుతోంది. కానీ, ఇటీవల కాలంలో ఆ పార్టీ తీసుకుంటున్న కొన్ని చర్యలు మాత్రం ఇటు జనానికి గానీ, అటు పార్టీ కార్యకర్తలకు గానీ అర్థం కావడం లేదు.

ఇటీవల కాలంలో ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టీడీపీకి ఉన్న బలం ప్రకారం ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్కసీటు కూడా గెలిచే అవకాశాల్లేవ్. అయినా, ఆ పార్టీ నుంచి దళితుడైన సీనియర్​నేత వర్ల రామయ్యను బరిలోకి దించింది. చివరకు ఆ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. తమకు గెలిచే సంఖ్యాబలం లేకున్నా రాజ్యసభ ఎన్నికలో పోటీకి దిగిన టీడీపీ ఇప్పుడు జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో ఎందుకు పోటీకి దిగడం లేదన్నది అంతుబట్టడం లేదని తెలుగు తమ్ముళ్లు అంతర్మథనంలో ఉన్నారు. వాస్తవానికి ఈ స్థానం ఖాళీ కావడానికి కారణం డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ రాజీనామా చేయడమే. డొక్కా టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు. అయితే, కొంతకాలం క్రితం ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్​సీపీలో చేరారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ద్వారా ఎమ్మెల్యేల కోటా నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు.

ఇప్పుడు ఆ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో డొక్కా వైఎస్సార్​సీపీ నుంచి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ దాఖలుకు గురువారం సాయంత్రం వరకు గడువు ముగిసింది. కానీ, ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎవరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. దీంతో డొక్కా ఏకగ్రీవం కావడం లాంఛనమే. గురువారం సాయంత్రం నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసే సమయానికి ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకూ గడువు ఉంది. ఒక్క దరఖాస్తే రావడంతో ఎమ్మెల్సీగా డొక్కా ఎన్నిక దాదాపుగా ఖాయమైనట్లే. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే, కేవలం పది రోజుల తేడాతో జరిగిన ఈ రెండు ఎన్నికల్లో టీడీపీ రెండు రకాల నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏమై ఉంటుందా అని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. చంద్రబాబు గారు ఏది చేసినా దానికో లెక్క ఉంటుందిలే అని సమర్థించుకుంటున్నారు.