సారథి న్యూస్, శ్రీకాకుళం: కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పాతపట్నం మండలంలో లాక్ డౌన్ ను మరింత కఠినం చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్పష్టం చేశారు. జిల్లాలో మూడు పాజిటీవ్ కేసులు నమోదవ్వడంతో అన్నిశాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. శనివారం కలెక్టర్ జె.నివాస్ మీడియాతో మాట్లాడుతూ పాతపట్నం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి రాగానే పరీక్షలు నిర్వహిస్తే పాజిటీవ్ గా వచ్చిందని, కాకినాడ తుది ఫలితాల కోసం పంపించగా నెగిటీవ్ వచ్చిందని తెలిపారు. సదరు వ్యక్తి కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని, అతనితో కాంటాక్ట్ లో ఉన్న 29 మందిని ప్రాథమికంగా పరీక్షించామన్నారు. మార్చి 20న ఢిల్లీ నుంచి వచ్చిన 211 మందిని గుర్తించి హోమ్ ఐసోలేషన్ లో ఉంచామన్నారు. జిల్లాకు ఢిల్లీ, ముంబై ఇతర ప్రాంతాల నుంచి 13,500 మంది వచ్చారని, వారందరినీ హోమ్ ఐసోలేషన్ లో పెట్టామని తెలిపారు. ఇకపై వారంతా ఇళ్లల్లోనే ఉండాలని కోరారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే స్థానికంగా ఉండే ఆశా కార్యకర్త, ఏఎన్ఎంలకు తక్షణమే తెలుపాలని సూచించారు. మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, రెవెన్యూ, వైద్య, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, తదితర శాఖల అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఇంటింటికీ మందులు
పాతపట్నంతో పాటు కాగువాడ, సీది, కొరసవాడ చుట్టుపక్కల 18 గ్రామాల్లో కూరగాయలు, కిరాణ సరుకులు, మందులు, తాగునీటిని డోర్ డెలివరీ ద్వారా అందిస్తామని తెలిపారు. పశువులకు కూడా అక్కడే ఆహారం అందిస్తారని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు బయటికి రావడానికి వీల్లేదని, పొరుగు వారితోనూ మాట్లాడొద్దని సూచించారు.
ఇంటింటి సర్వేకు ప్రత్యేక బృందాలు..
కంటోన్మెంట్ గ్రామాల్లో ఇంటింటి సర్వే చేయుటకు ప్రత్యేకంగా 23 మంది వైద్యులు, 200 మంది ఆశా కార్యకర్తలు, వైద్యసిబ్బందిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. జిల్లాలో కరోనా కట్టడికి అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు కూడా సహకరించాలని కోరారు.