సారథి న్యూస్, హైదరాబాద్: ఫ్యాన్స్ అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కలలగన్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లూ చేసుకున్నారు. కానీ ఈసారి పుట్టిన రోజు వేడుకల్లో విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పం మండలం శాంతిపురం వద్ద కటౌట్ కడుతూనే విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు స్పాట్లోనే మృత్యువాతపడ్డారు. దాదాపు 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే మరణించిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రంగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరణించిన వారిని సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలంగా గుర్తించారు. అయితే ఈ ఘటన పై పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. తన అభిమానుల మరణానికి తీవ్ర దిగ్ర్భాంతికి లోనవుతూ.. మాటలకు అందని విషాదం అని పేర్కొన్నారు. అంతేకాదు వారి కుటుంబానికి అండగా ఉంటానని కూడా మాట ఇచ్చారు.
ఈ విషాదం నుంచి తేరుకోకముందే మరో అనూహ్య సంఘటన వరంగల్ జిల్లా పరకాలలో చోటుచేసుకుంది. పవన్ సెలబ్రేషన్స్ కోసం కారులో వరంగల్ జిల్లా పరకాలకు బయలుదేరిన ఐదుగురు స్నేహితులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. యువకులు ప్రయాణిస్తున్న కారును కాళేశ్వరం నుంచి వరంగల్ వస్తున్న ఇసుకలారీ ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. నిద్రమత్తులో ఉండి లారీడ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు నుజ్జునుజ్జవడంతో ఐదుగురి మృతదేహాలను బయటకు తీసేందుకు చాలా శ్రమపడ్డారు. మృతులు వరంగల్ పోచమ్మమైదాన్ వాసులుగా గుర్తించారు.