పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా బుధవారం ‘వకీల్ సాబ్’ చిత్రం నుంచి మోషన్ పోస్టర్ రిలీజైతే, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న పిరియాడికల్ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా షెడ్యూల్ కూడా ఒకటి పూర్తి చేశారు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేశారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొగల్ సామ్రాజ్య నిధులను దోచుకునే దొంగ పాత్రలో కనిపించనున్నారు. ఫేస్ ను రివీల్ చేయకుండా దర్జాగా నడుము మీద చేయివేసుకుని, స్టైల్ గా గుర్రపు స్వారీ చేస్తున్నాడా? అన్నట్టు ఉంది పోస్టర్.
దీంతో ఇదొక పీరియాడికల్ మూవీ అని.. పవన్ కళ్యాణ్ ఓ హిస్టారికల్ పాత్ర పోషించబోతున్నాడని స్పష్టమైంది. కాగా, డైరెక్టర్ క్రిష్ ఈ పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెష్ తెలుపుతూ.. ‘15 రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది.. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది.. ఇందుకు కారణం మీరు మీ ప్రోత్సాహం మీ సహృదయం.. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తున్నాం..’ అంటూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్.. రామ్ – లక్ష్మణ్ యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేయనున్నారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.