Breaking News

పరుగుల వరద.. ఆసీస్​దే సీరిస్​

పరుగుల వరద.. ఆసీస్​దే సీరిస్​

సిడ్నీ: ఆసీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సీరిస్​లో భాగంగా రెండో వన్డేలోనూ పరుగుల వరద పారింది. కంగారులను నిలువరించలేని టీమిండియా సిరీస్​ను చేజార్చుకుంది. ఆసీస్​51 పరుగుల తేడా ఘనవిజయం సాధించింది. మ్యాచ్​మిగిలి ఉండగానే 2‌‌‌‌‌‌–0 తేడాతో సిరీస్​ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్​ఎంచుకున్న ఆసీస్​నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్​బ్యాట్స్​మెన్లలో వార్నర్‌(83; 77 బంతుల్లో 4×7, 6×3), ఇరోన్​ఫించ్‌(60; 69 బంతుల్లో 4×6, 6×1‌), స్టీవ్‌ స్మిత్‌(104; 64 బంతుల్లో 4×14, 6×2), లబూషేన్‌(70; 61 బంతుల్లో 4×5), మ్యాక్స్‌వెల్‌( 63; 29 బంతుల్లో 4×4, 6×4) మెరుపులు మెరిపించడంతో ఆసీస్‌ రికార్డు స్థాయి స్కోరును చేయగలిగింది. వార్నర్‌-ఫించ్‌ తొలి వికెట్‌ నష్టానికి 142 పరుగుల చక్కటి భాగస్వామ్యం అందించారు.

ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 338 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా ఆటగాళ్లు చివరి దాకా పోరాడినా భారీ లక్ష్యం కావడంతో ఓటమి తప్పలేదు. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(30; 23 బంతుల్లో 4×5), మయాంక్‌ అగర్వాల్‌(28; 26 బంతుల్లో 4×4) మంచి శుభారంభం అందించారు. ఆ తరువాత వచ్చిన విరాట్‌ కోహ్లి(89 ; 87 బంతుల్లో 4×7, 6×2), శ్రేయస్‌ అయ్యర్‌(38; 36 బంతుల్లో 4×5) జట్టు స్కోరును పరుగెత్తించారు. ఆ తర్వాత కోహ్లి‌‌– కేఎల్‌ రాహుల్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేసి ఆకట్టుకున్నారు. ఇంతలో కోహ్లి ఔట్​కాగా, హార్దిక్‌ పాండ్యాతో కలిసి కేఎల్​ రాహుల్‌ ( 76; 66 బంతుల్లో 4×4, 6×5) సొగసైన షాట్లు ఆడుతూ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా(24), హార్దిక్‌ పాండ్యా(28), షమీ, సైనీ, బుమ్రా ఎంతోసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ 9 వికెట్ల నష్టానికి 338 పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమి పాలైంది.