- రైతు, కూలీలకు ఇబ్బందులు రానివ్వం
- రెడ్ జోన్లపై నిఘా
- సారథి ప్రతినిధితో పెద్దపల్లి కలెక్టర్ సిక్తాపట్నాయక్
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. మన రాష్ట్రంలో మే 7 వరకు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలో లాక్ డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ సిక్తాపట్నాయక్ చెప్పారు. ఆ వివరాలు…
సారథి: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పెద్దపెల్లి జిల్లాలో అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
కలెక్టర్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతనెల 22, 24 తేదీల నుంచి ఏప్రిల్ 14 తారీకు వరకు మొదటి విడత లాక్ డౌన్ అమలు చేశాయి. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లాలో కూడా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వైద్యులు, పోలీసులు రెవెన్యూ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు నిబంధనలను పాటించే విధంగా వైరస్ ఒకరి ద్వారా ఒకరికి సోకకుండా ఉండేందుకు సామాజిక దూరం పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతిరోజు వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ అందరితో సమీక్షిస్తున్నాం. ఎంపీడీవోలు, తహసీల్దార్, ఇతర అధికారులతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం.
సారథి: జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటివరకు ఎంతమంది అనుమానితులను గుర్తించారు. వైద్యపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
కలెక్టర్: ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి మన జిల్లాకు వచ్చిన వారిని, వారికి సంబంధాలు ఉన్న వారిని అనుమానితులుగా గుర్తించి ముందస్తు చర్యల్లో భాగంగా క్వారంటైన్ సెంటర్లలో ఉంచాం. జిల్లాలో గర్రెపల్లి సుల్తానాబాద్, నంది మేడారం ప్రాంతాల్లో ఈ కేంద్రాలను మొదట్లో ఏర్పాటుచేశాం. పెద్దపల్లి, సుల్తానాబాద్, గోదావరిఖని ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటుచేశాం. ఇటీవల రామగిరి జేఎన్టీయూ కాలేజీలో కూడా క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటుచేశాం. జిల్లాలో మొత్తం 398 మందిని ఆయా కేంద్రాల్లో ఉంచగా, 14 రోజుల పాటు అక్కడే ఉన్నారు. వారందరికీ బ్లడ్ శాంపిల్ పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. ఇది మన జిల్లాలో మంచి పరిణామంగా భావిస్తున్నాను.
సారథి: జిల్లాలో ఇద్దరి వ్యక్తులకు పాజిటివ్ వచ్చింది కదా.. వారి పరిస్థితి ఏమిటి, వారితో ఎంతమంది సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.?
కలెక్టర్: జిల్లాలో ఢిల్లీ లోని మర్కజ్ వెళ్లి జిల్లాకు వచ్చిన ఎనిమిది మందిలో ఏడుగురిని గుర్తించి ముందస్తుగానే గర్రెపల్లి, సుల్తానాబాద్ క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచాం. వారిని వైద్యపరీక్షల కోసం పంపించగా, ఒకరికి పాజిటివ్ రావడంతో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించాం. అతని కుటుంబాన్ని క్వారంటైన్ సెంటర్కు పంపించాం. గోదావరిఖనిలోని జీఎం కాలనీకి చెందిన ఓ యువకుడు పంజాబ్ లో బీటెక్ పూర్తిచేసుకుని ఏపీ ఎక్స్ ప్రెస్ ఢిల్లీ నుంచి ఇంటికి రాగానే ముందస్తుగా క్వారంటైన్ కేంద్రానికి పంపించాం. అతనికి కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో అతని కుటుంబం, ఆ కుటుంబంతో సంబంధం ఉన్న వారిని కూడా గుర్తించి ఆయా కేంద్రాలకు పంపించాం. ఇప్పటివరకు జిల్లాలో ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. వారు నివాసం ఉండే అన్నపూర్ణ, కాలనీ జీఎం కాలనీలను రెడ్ జోన్లుగా గుర్తించి అక్కడ బారికేడ్లు ఏర్పాటుచేసి రాకపోకలను నిలిపివేశాం.
సారథి: గోదావరిఖని పట్టణంలోని రెడ్ జోన్ ఏరియాలో ఎలాంటి చర్యలు చేపట్టారు..?
కలెక్టర్: గోదావరిఖని పట్టణంలోని రెడ్ జోన్ కాలనీ ప్రజలు బయటికి వెళ్లేందుకు వీల్లేదు. స్థానికుల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు రెవెన్యూ సిబ్బంది, డాక్టర్లు ఇతర అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా అక్కడి స్థానికులకు తాగునీరు, పాలు నిత్యావసర వస్తువులు కూరగాయలను హోం డెలివరీ చేస్తున్నాం.. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అధికారులతో నిత్యం భాగస్వామ్యంతో సౌకర్యాలు కల్పిస్తున్నాం.
సారథి: వ్యవసాయ పనులకు సంబంధించి ప్రస్తుతం వరి కోతలు వచ్చాయి. లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు, కూలీలకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
కలెక్టర్: వ్యవసాయ రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. రైతుల పొలాల్లో ట్రాక్టర్లు హార్వెస్టర్ లను గుర్తించి రైతులకు ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామానికి ఒకటి రెండుచొప్పున ఇప్పటివరకు 292 కొనుగోలు కేంద్రాలను గుర్తించి 25 కేంద్రాలను ప్రారంభించాం. ఇప్పటివరకు ఆరువేల క్వింటాళ్ల ధాన్యం కొన్నాం. ఆయా కేంద్రాల్లో ధాన్యం మిల్లర్లకు తరలించేందుకు వాహనాలు, తూకాలు వేసేందుకు కాంటాలను ఏర్పాటు చేయడంతో పాటు హమాలీలను నియమించాం.
సారథి: జిల్లాలో వారం క్రితం వరకు మాస్కుల కొరత ఉంది . ‘ప్రభుత్వం మా స్కూలు తప్పనిసరి’ అని చెప్పడంతో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు.
కలెక్టర్: జిల్లాలో ప్రస్తుతం మాస్కుల కొరత లేదు. రెండు వారాల క్రితమే జిల్లా వైద్య శాఖ జిల్లాకు కావాల్సిన మాస్కుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా మొదటి విడత జిల్లాకు వచ్చిన వాటిని వైద్యశాఖ సిబ్బంది, పోలీసులు, రెవెన్యూశాఖ, పంచాయతీ పట్టణాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశాం. ప్రతి మండలానికి 500 చొప్పున మాస్కులు ఇప్పటికే పంపిణీ చేశాం. గ్రామాల్లో తయారుచేయాలని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆదేశాలు ఇచ్చాం. వారు సరిపోయేలా మాస్కులను తయారుచేసి పంపిణీ చేస్తారు.
సారథి: లాక్డౌన్ నేపథ్యంలో జిల్లాలో పేదలు, కూలీలు బతుకుదెరువు కోసం ఇబ్బందులు పడుతున్నారు.. ఉపాధి హామీ పనులు ఏమైనా జరుగుతున్నాయా?
కలెక్టర్: లాక్ డౌన్ తో ఉపాధి హామీ చట్టం కింద పనులు జరగడం లేదు .అయితే ఇటీవలే ప్రభుత్వం పనులు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. సామాజిక దూరం పాటించే విధంగా పనులు కల్పించేందుకు చర్యలు చేపడతాం. ఇప్పటివరకు కొంత ఆలస్యంగా పనులు జరుగుతున్నాయి. ఉపాధి హామీ పనులు గ్రామాల వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటాం.