Breaking News

నో మాస్క్​.. నో డిస్టెన్స్​

సారథి న్యూస్​, నారాయణఖేడ్​: వానాకాలంలో ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నా.. రైతన్నలకు మాత్రం అవస్థలు తప్పడం లేదు. నిన్న మొన్న వరుసగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ఫర్టిలైజర్​ షాపులు, అగ్రికల్చర్​ ఆఫీసుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంతో పాటు తడ్కల్ గ్రామంలో ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ సోయాబీన్ విత్తనాల కోసం రైతులు శుక్రవారం పొద్దంతా క్యూ కట్టారు.

కంగ్టి గ్రామంలోని స్థానిక పంచాయతీ, వెలుగు ఆఫీసు, పశువుల దవాఖానలో ఏర్పాటుచేసిన కౌంటర్లలో టోకెన్ సిస్టం ద్వారా సబ్సిడీ సోయాబీన్ విత్తనాలు పంపిణీ చేశారు. అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భౌతిక దూరం పాటించకుండా.. మాస్క్​లు లేకుండా ఒకరినొకరు తీసుకున్న తీరు అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపట్టింది. అసలే కరోనా కాలం.. మహమ్మారి ఎవరికైనా అంటుకుంటే పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నించారు.