కలకత్తా: బంతిపై ఉమ్మిని రుద్దకుండా నిషేధం విధించినా.. తాను మాత్రం రివర్స్ స్వింగ్ రాబడతానని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. కాకపోతే బంతి రంగు మారకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించాడు. ‘ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చిన్నతనం నుంచి పేసర్లు బంతిపై ఉమ్మి రుద్దేందుకు అలవాటుపడ్డారు. ఇది ఆటలో భాగమైపోయింది. ఒకవేళ నీవు ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే బంతి రంగు మెరుగపర్చేందుకు ఉమ్మిని రుద్దాల్సిందే. అయితే ఆ బంతి రంగు పోకుండా కాపాడగలిగితే కచ్చితంగా రివర్స్ స్వింగ్ రాబట్టొచ్చు’ అని షమీ పేర్కొన్నాడు.
ఉమ్మి స్థానంలో చెమటను ఉపయోగించడం ద్వారా పెద్దగా ప్రయోజనమేమీ ఉండదన్నాడు. ఉమ్మి, చెమటను వాడడం వల్ల చాలా తేడాలు ఉంటాయన్నాడు. మైదానంలో, వెలుపలా.. ధోనీని చాలా మిస్ అవుతున్నామని షమీ అన్నాడు. ఏదో కోల్పోయినట్లుగా ఉందన్నాడు. ‘ధోనీ హయాంలో నేను అన్ని ఫార్మాట్లలో ఆడా. ఒక్క ఐపీఎల్ తప్ప. అతని మార్గదర్శకత్వం మాలాంటి క్రికెటర్లకు చాలా అవసరం. సహచరులను ఎల్లప్పుడూ గొప్ప దృష్టితో చూస్తాడు. నేను ధోనీని వాళ్లతో ఎందుకు మాట్లాడాలనే భావన రానీయడు. చాలా గొప్ప ప్లేయర్. మహీతో నాకు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. మహీ భాయ్ ఉంటే చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఇప్పటికీ మాకు అనుకుంటున్నాం. ధోనీ ఉన్నాడంటే చుట్టు నలుగురైదురు ఉండాల్సిందే. కలిసి డిన్నర్ చేసేవాళ్లం. లేట్ నైట్ దాకా మాట్లాడుకునే వాళ్లం. ఇలాంటివన్నీ మిస్ అవుతున్నాం’ అని షమీ గుర్తు చేసుకున్నాడు.