Breaking News

నెలకు రూ.75 జీతం.. మురిసిపోయా

నెలకు రూ.75 జీతం.. మురిసిపోయా

విజయం ఎప్పుడూ వెంటనే వరించదు. తన కోసం తపించే వారి మనసును పరీక్షిస్తుంది. అడ్డంకులను సృష్టించి, కష్టాలను కలిగిస్తుంది. అవకాశాలను చేజారుస్తుంది. వాటన్నింటినీ తట్టుకుని, కష్టాల కన్నీటిని అదిమిపట్టి, ఎంత కష్టమొచ్చినా ఎదిరించి నిలిచిన వారికే అది వరమవుతుంది. 14 ఏళ్ల వయస్సులో బడిలో ఉండాల్సిన అమ్మాయి పెళ్లి పీటల మీద కూర్చుంది. 23 ఏళ్లకే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఏదైనా ఉద్యోగం చేయాలనే తండ్రి కలను నెరవేర్చింది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(డీఆర్​డీఏ) రంగారెడ్డి జిల్లాలో సూపరింటెండెంట్‌గా పనిచేసి ఉత్తమ అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు శారద. ఆగస్టు 31న తన రిటైర్ట్​మెంట్​ సందర్భంగా ఆమె తన జీవిత, ఉద్యోగ అనుభవాలను ‘సారథి’తో పంచుకున్నారు.

డీఆర్‌డీఏలో 33 ఏళ్ల 3 నెలల సర్వీసు పూర్తయింది. నేనొచ్చి 58 ఏళ్లు గడిచిపోయాయి. ఇన్నేళ్లలో చేసినవన్నీ గుర్తుచేసుకుంటే అంతా గమ్మత్తుగా అనిపిస్తుంది. శారద ఈ మూడక్షరాలే మా అమ్మానాన్న నాకు ఇచ్చిన ఆస్తి. ఐశ్వర్యం. భగవంతుడి దయతో కొద్దోగొప్పో వారి లక్షణాలు వచ్చాయి. వాటిని నిలబెట్టాలి కదా. మా నాన్న శంకరయ్యగౌడ్‌కు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎంతో ఇష్టం. ఆయన మనసులో ఉద్యోగులంటే గౌరవం.. అభిమానం. అందుకే చిన్నప్పటి నుంచి మాలో ప్రేరణకు చిహ్నంగా ఎన్నో ఉదాహరణలు చెప్పేవారు. మా కోసం నాన్న తన జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన నుంచి స్ఫూర్తి పొందిన నేను నా జీవితాన్ని మార్చుకున్నాను. మన కష్టార్జితాన్ని ఎంత జాగ్రత్తగా పొదుపు చేస్తే మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్‌ అంత బాగుంటుందని చెప్పేవారు. ఆలా అయన మాటలు నా మనసులో నాటుకుపోయాయి. మా చిన్నాయన తిరుపతయ్యగౌడ్‌ అప్పట్లోనే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. లోకల్‌ఫండ్‌ ఆఫీసులో ఆడిటర్‌ నుంచి సూపరింటెండెంట్‌ స్థాయి వరకు పనిచేశారు. మా చిన్నాయనను ఆదర్శంగా తీసుకోవాలని మా నాన్న ఎప్పుడు చెబుతుండేవారు. మా అన్న సత్యనారాయణ గౌడ్‌ పోస్టుమాస్టర్‌గా రిటైర్‌ అయ్యారు. మొదట్లో మా అన్నయ్యకు పోస్టుమాస్టర్‌ ఉద్యోగం వచ్చిందని మా నాన్న ఎంతో సంతోషపడ్డారు. మా తమ్ముడు చంద్రశేఖర్‌గౌడ్‌ను కూడా ప్రభుత్వ ఉద్యోగం చేయాలని మా మాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. కానీ మా తమ్ముడు ఎంతో ఇష్టంతో పత్రికారంగంలో స్థిరపడ్డారు. ఆంధ్రభూమిలో మహబూబ్‌నగర్‌ జిల్లా రిపోర్టర్‌ నుంచి స్టేట్‌ బ్యూరో చీఫ్‌ స్థాయికి ఎదిగారు. నా విషయంలో ఉద్యోగరీత్యా మా తమ్ముడు ఎప్పుడు చేదోడువాదోడుగా ఉంటూ అన్ని విషయాల్లో సహాయం చేశారు. అలాగే అన్నయ్య, వదినమ్మ, తమ్ముడు మరదలు, చెల్లెళ్లు, మరుదులు, మా పిల్లలు, వారి పిల్లలు, మా చిన్నాయనలు, చిన్నమ్మలు, అత్తయ్యలు, మామయ్యలు, బంధువులు వారి పిల్లలు అందరికీ నేనంటే ప్రాణం. వారి నమ్మకాన్ని కాపాడుకోవాలి కదా? అనునిత్యం అడుగడుగునా ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ నా ప్రయాణం సాగించాను. ఈ ప్రయాణంలో ఎక్కడా నిర్లక్ష్యం వహించింది లేదు. ఎవరినీ బాధ పెట్టింది లేదు. నాకు అప్పగించిన ప్రతి పనిని బాధ్యతగా నిర్వహించాను.

పుట్టింది.. పెరిగింది వెల్జాల్‌లో
పుట్టింది.. పెరిగింది ఉమ్మడి మహబూబ్​ నగర్​ జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్‌లోనే. వెల్జాల్‌ అంటే గుర్తుకొచ్చేది రెండు కొండల మధ్య మా గ్రామం. ఒక కొండకు ఆవల పెద్దచెరువు, మరో కొండపై కొలువు దీరిన లక్ష్మీనర్సింహాస్వామి. అటు తలకొండపల్లి.. ఇటు మిడ్జిల్‌ నుంచి మా ఊరికి వెళ్తుంటే రోడ్డుకు ఇరువైపులా పచ్చని పొలాలు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇలాంటి ఊరు ఎక్కడ ఉండదేమో అనిపిస్తుంది. బాల్యస్మృతులతో ముడిపడిన మా ఊరంటే నాకు ఎంతో ఇష్టం. చాలాకాలంగా అలవాటు పడడం వల్లనో.. సొంతమనే మమకారంతోనో ఏమో కానీ మా ఇల్లు.. మా ఊరంటే నాకు ప్రాణం. నేనంటే మా అమ్నానాన్నకు ఎంతో ప్రాణం. అలాగని గారాబం చేసే వారు కాదు. వాస్తవంలో బతకడం నేర్పారు. నాన్న మమ్మల్ని క్రమశిక్షణతో పెంచారు. ఏదైనా చిన్న ఉద్యోగమైనా సరే చేయాలని చెప్పేవారు. జీవితంలో ఏదో ఒకటి చెయ్‌.. నిరూపించుకో.. లేదంటే మనుగడ కష్టమంటూ హితబోధ చేశారు. ఆ మాటలు బాగా పని చేశాయి. ఇంట్లో నాన్న పక్కన కూర్చుని కంఠస్థం చేసిన పద్యాలు.


చదువంతా వెల్జాల్‌లోనే..
ఒకటి నుంచి 10వ తరగతి వరకు వెల్జాల్‌లోనే చదివాను. మొదటిసారి మా నాన్న స్కూలుకు వచ్చి జాయిన్‌ చేశారు. మా నాన్న శంకరయ్య గారంటే అక్కడి టీచర్లకు ఎంతో గౌరవం, అభిమానం. స్కూల్‌ వాతావరణం నాకు బాగా నచ్చేది. బాగా చదివేదాన్ని. ఫస్ట్‌ క్లాస్‌ మార్కులు తెచ్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించే దాన్ని. లెక్కలు అంటే ఇష్టం. మ్యాపులు వేయడం వాటికి రంగులు వేయడం ఆసక్తిగా ఉండేది. అయితే కొన్ని కారణాలతో పదవ తరగతి పరీక్షలు రాయలేకపోయాను.

చూపులు కలసిన శుభవేళ
మా ఇంట్లో ప్రతిరోజు రాత్రి భోజనం చేశాక మా నాన్నతో మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. అలా ఒకరోజు శారదమ్మను చూసుకోవడానికి బొమ్మరాస్‌పల్లి నుంచి సంబంధం వస్తుందని నాన్న చెప్పారు.. అలా బొమ్మరాస్‌పల్లికి చెందిన పోలేపల్లి కిష్టమ్మ, నర్సింహులు గౌడ్‌ ప్రథమ పుత్రుడు యాదయ్యగౌడ్‌తో 1976 మే 6న వివాహం వెల్జాల్‌లోనే జరిగింది. కాలం గడిచిపోయాక.. మా పుట్టింట్లో ఎలా ఉన్నానో అలాగే అత్తారింట్లోనూ ఉన్నాను. ఇంట్లో వారందరికీ నా మీద ఎంత నమ్మకం అంటే ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే నాతోనే చెప్పేవారు. నేను వాటిని చేయగలనని వారి నమ్మకం. నాకు కూడా మా అత్తయ్యలు, మామయ్యల పిల్లలను చూస్తే చాలా గర్వంగా ఉండేది.


తొలి ఉద్యోగం
విజయం అంటే గుర్తుకొచ్చేది తొలిసారి చేసిన ఉద్యోగం. తొలిసారి అందుకున్న సంపాదన. విజయం ఇంత ప్రభావం చూపిస్తుందా! అని ఆశ్చర్యపోయిన క్షణాలవి. భవిష్యత్‌లో మరిన్ని సాధించాలనే తపన ఎప్పుడూ వెంటాడుతోంది. మన విజయాన్ని చూసి కుటుంబసభ్యులు ఎంతో సంతోషించే వారు. వారిని అలా చూడడం నాకెంతో ఇష్టం. అప్పట్లో ప్రభుత్వం గ్రామాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడానికి వయోజనవిద్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో రాత్రిపూట బడులను నిర్వహించేది. అలా 1978లో బొమ్మరాస్‌పల్లిలో రాత్రి బడి ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలలో టీచర్‌గా జాయిన్‌ అయ్యాను. అప్పట్లో ఆ పాఠశాలలో చదవుపై ఆసక్తి ఉన్న 20నుంచి 30మంది పెద్ద వాళ్లు వచ్చేవారు. ఎంతో శ్రద్ధగా వారికి అక్షరాలు నేర్పించాను. చిన్పప్పటి నుంచి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కోరిక మొదటిసారి ఇలా నెలవేరింది. అప్పట్లో నెలకు రూ.75 ఇచ్చేవారు. వయోజన విద్య ప్రాజెక్టు ఆఫీసు ఆమనగల్లులో ఉండేది. ప్రతి మూడు నెలలకోసారి అక్కడ ఏర్పాటుచేసే సమావేశానికి వెళ్లి జీతం తెచ్చుకునే వాళ్లం. అప్పట్లో బొమ్మరాస్‌పల్లికి బస్సు సౌకర్యం ఉండేది కాదు. బొమ్మరాస్‌పల్లి నుంచి ఊర్కొండ స్టేజీ వరకు ఐదు కి.మీ. ఎద్దుల బండిపై వెళ్లి, అటు నుంచి బస్సులో కల్వకుర్తి, అటు నుంచి ఆమనగల్లుకు వెళ్లి తిరిగి వచ్చేదాన్ని. సుమారు 74 కి.మీ.ప్రయాణం చేసే వాళ్లం. ఇలా రెండేళ్లు పనిచేశాను. ఇప్పటికీ గ్రామంలో ఎవరైనా కనిపిస్తే పంతులమ్మా బాగున్నావా! అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు.

పొదుపు + మదుపు = గెలుపు
డీఆర్‌డీఏ (డిస్ట్రిక్ట్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ).. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వేల వేల జీవితాలను మార్చేసింది. మహిళా సాధికారత ద్వారా పేదరికాన్ని తరిమి వేయాలన్న ఆశయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ. ఈ సంస్థలోని పథకాలు ఆశయాల నుంచి ఆచరణ వరకు ఆంతా వినూత్నమే. మహిళల సమర్థతకు నిలువెత్తు నిదర్శనం. ఉద్యోగ విధుల్లో భాగంగా నేను ఈ సంస్థలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. 33 ఏళ్ల క్రితం ఈ సంస్థలో ఏజీఎస్‌గా బాధ్యతలు చేపట్టి నేడు సూపరింటెండెంట్‌గా రిటైర్‌ అవుతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. మొట్టమెదట ఈ సంస్థ ద్వారా మహిళా సంఘాలను ఏర్పాటు చేయించాను. వారందరితో పొదుపు చేయిస్తూ వారి కాళ్ల మీద నిలబడడానికి వీలుగా ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇప్పించాను. ఇలా వివిధ ప్రాంతాల్లో 1987నుంచి 2005 వరకు మొత్తం 1500 గ్రూపులను ఏర్పాటు చేయించాను. అందరూ పొదుపు చేస్తూనే ఇంటి దగ్గర వివిధ చేతివృత్తుల పనులు చేసేవారు. మంచి ఫలితాలు రావడం చూసి ఉన్నతాధికారులు వచ్చి మహిళా సంఘాలతో సమావేశమై కొత్త కొత్త పనులు చేపట్టాల్సిందిగా ప్రోత్సహించేవారు. ఈ సంస్థ ద్వారా చేపట్టిన పథకంలో చేరేందుకు పేదరికమే ప్రధాన అర్హత. 15మంది మహిళలతో గ్రూపు ఏర్పాటు చేయాలి. వీరికి రివాల్వింగ్‌ ఫండ్‌ కింద మొదట్లో రూ.7500, తర్వాత కొన్నేళ్లుకు రూ.15వేలు ఇచ్చేవారు. వీరికి అన్ని స్థాయిల్లో ఉన్నతాధికారులు మార్గదర్శనం వహించేవారు. బ్యాంకు అధికారులు సహకరించే వారు. పొదుపు సంఘాలు నెలవారీగా సమావేశం కావాలి. ఇవన్నీ సంఘం సభ్యులకు ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేశాను. అప్పుడప్పుడు అధికారులు విజిట్‌ చేసి పథకాలపై అవగాహన కల్పించి, ఎలా లబ్ధి పొందాలో వివరించే వారు.

డీపీఎంగా ఎన్నో బాధ్యతలు
అప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో డ్వాక్రా గ్రూపులో 16 మంది(ఏజీఎస్‌ పోస్టుల పేర్లు ఈవోలుగా మార్చారు) ఈవోలుగా పనిచేస్తున్నాం. వీరిలో నేను అప్పటికే డిగ్రీతో పాటు డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష పాసై ఉన్నాను. ఈ క్రమంలో అర్హులైన ఇద్దరికి డీపీఎం పోస్టు ఇచ్చేందుకు సెర్ప్‌ ఆఫీసు నుంచి ఇంటర్వ్యూకు రమ్మని పిలిచారు. నాకు అవకాశం రావడంతో ఇంటర్వ్యూకు వెళ్లాను. నాన్‌–ఫార్మల్‌ డీపీఎంగా ప్రమోషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత మిడ్జిల్‌ నుంచి రంగారెడ్డి జిల్లా డీఆర్‌డీఏ కార్యాలయానికి బదిలీ చేశారు. ఐదేళ్లు డీపీఎంగా పని చేశాను. ఈ క్రమంలో టీటీడీసీలో ట్రైనింగ్‌ కోఆర్డినేటర్‌గా, ఎష్టాబ్లిష్‌మెంట్‌తో పాటు అకౌంట్స్‌ విభాగంలో మరో ఐదేళ్లు విధులు నిర్వహించాను. తర్వాత సెర్ప్‌ ఆఫీసు అధికారులు డీపీఎం నుంచి సూపరింటెండెంట్‌గా ప్రమోషన్‌ ఇచ్చి నాగర్‌కర్నూల్‌ డీఆర్‌డీఏ కార్యాలయానికి బదిలీ చేశారు. 2019 మార్చి ఒకటో తేదీన నాగర్‌కర్నూల్‌ డీఆర్‌డీఏ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టాను. ఈ క్రమంలో ఏపీవో(పింఛన్‌)గా, తర్వాత కొన్నిరోజులకు ఏవో (అడ్మినిస్ట్రేటివ్‌)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అన్నిచోట్ల నాకు అప్పగించిన పనులన్నింటినీ పూర్తి చేశాననే సంతృప్తిగా ఉన్నాను.

భర్త ప్రోత్సాహం.. పిల్లల సహకారం
ప్రతి సక్సెస్‌ఫుల్‌ లైఫ్‌ వెనుక గొప్ప కష్టాలు ఉంటాయి. నా జీవనయానంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. ఒక్కోసారి ఈ ఉద్యోగం వద్దు.. ఇంటికి వెళ్లిపోదామనే సందర్భాలు ఉన్నాయి. ప్రతి కష్టాన్ని అధిగమిస్తూ ఈరోజు నేను ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాను. డీఆర్‌డీఏలో ఏజీఎస్‌ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ సూపరింటెండెంట్‌ స్థాయికి వచ్చాను. ఇదంతా నా భర్త యాదయ్యగౌడ్‌ ప్రోత్సాహం, పిల్లలు రాధిక, దీపిక, రాఘవేందర్‌గౌడ్‌ సహకారంతోనే సాధ్యమైంది. అన్ని విషయాల్లో వారు తోడునీడగా ఉన్నారు. ఎప్పుడైనా నేను వచ్చే వరకు ఆలస్యమైతే మా ఆయన ఇంటి బాధ్యతలు చూసుకునేవారు. నా కష్టాలను పిల్లలకు తెలియనివ్వలేదు. ఆనందాన్ని పంచుకుంటే రెండింతలు అవుతుందని మాత్రమే చెప్పాను. బొమ్మరాస్‌పల్లిలో ఉన్నంత వరకు ఎలాంటి కష్టాలు తెలియవు. ఇక్కడ ఉంటే పిల్లల భవిష్యత్‌ ఎలా అనే ఆలోచనలు వెంటాడేవి. నా కాళ్ల మీద నేను నిలబడాలి, ఏదైనా ఉద్యోగం చేయాలని అనుకుంటుండేదాన్ని. అదే సమయంలో డ్వాక్రా గ్రూపులో ఉద్యోగం రావడంతో ఎంతో సంతోషం వేసింది. బొమ్మరాస్‌పల్లికి 150 కి.మీ. దూరంలో ఉన్న మానవపాడుకు పోస్టింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని నెలలకు నాగర్‌కర్నూల్‌ బదిలీ చేశారు. మానోపాడు, నాగర్‌కర్నూల్‌ బ్లాక్‌ పరిధిలో పని చేస్తున్న సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాను. చిన్నగది అద్దెకు తీసుకుని నేను, మా వారు, పిల్లలు ముగ్గురం ఉన్నాం. ఉదయమే పిల్లలకు, మాకు వంట చేసి గ్రామాల్లో గ్రూపులు చేయడానికి వెళ్లేదాన్ని. మళ్లీ ఎప్పుడో సాయంత్రం వచ్చేది. బయట తిరగడం ఒక ఎత్తయితే.. రికార్డుల నిర్వహణ మరో ఎత్తు. పనిఒత్తిడిలో ఒక్కోసారి ఉబికి వచ్చే కన్నీళ్లను గుండెల్లోనే అదిమిపట్టి వేరే వ్యాపకాలపై దృష్టి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఎన్నో కష్టాలను అధిగమించడానికి మా ఆయన ప్రోత్సాహం, పిల్లల సహకారం మరువలేనిది.