Breaking News

నెగెటివ్ వస్తే.. ఉమ్మి రుద్దనివ్వండి


న్యూఢిల్లీ: సిరీస్​కు ముందు జరిపే కరోనా పరీక్షల్లో నెగెటివ్ వస్తే.. వాళ్లు ఉమ్మిని ఉపయోగించేందుకు అవకాశం ఇవ్వాలని టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగర్కార్ కోరాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మిపై నిషేధం మంచిదే అయినా.. రాబోయే రోజుల్లో బౌలర్లు బాగా ఇబ్బందిపడాల్సి వస్తుందన్నాడు. ‘బ్యాట్స్​మెన్​కు బ్యాట్ ఎంత ముఖ్యమో.. బౌలర్లకు ఉమ్మి కూడా అంతే. మ్యాచ్​కు ముందే ప్లేయర్లకు కరోనా టెస్టులు నిర్వహిస్తారు. అందులో నెగెటివ్ వస్తే వాళ్లు సురక్షితమేనని భావిస్తారు. అలాంటి వాళ్లకు ఉమ్మిని ఉపయోగించే అవకాశం ఇవ్వాలి. ఇది నా అభిప్రాయం మాత్రమే. అయితే వైద్య బృందం దీనిపై మరింత విస్తృతమైన సూచనలు చేస్తారని ఆశిస్తున్నా. అయితే ఏ నిర్ణయమైనా ప్లేయర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇంగ్లండ్, వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఈ అంశాలన్నింటిపై ఓ అవగాహనకు రావాలి. ఆ తర్వాతే మరిన్ని నిర్ణయాల వైపు మొగ్గు చూపాలి’ అని అగర్కార్ చెప్పుకొచ్చాడు.