Breaking News

నిరుద్యోగులకు ‘కార్పొరేషన్​’ రుణాలు

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.19 కోట్ల రుణాలు

సారథి న్యూస్, మెదక్: జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ(ఎస్సీ కార్పొరేషన్​) ఆధ్వర్యంలో ఈ ఏడాది 448 మంది లబ్ధిదారులకు రూ.19.18 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా ఇన్​చార్జ్​కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందులో రూ.12.35 కోట్ల సబ్సిడీ కాగా, రూ.6.63 కోట్ల బ్యాంకు రుణం, లబ్ధిదారుల వాటా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంస్థ ద్వారా అమలుచేస్తున్న రూ.లక్షలోపు పథకాలకు 80 శాతం సబ్సిడీ, రూ.రెండు లక్షల్లోపు పథకాలకు 70 శాతం సబ్సిడీ, రూ.రెండు లక్షలు ఆ పైబడిన పథకాలకు 60 శాతం సబ్సిడీ లేదా రూ.ఐదులక్షలకు మించకుండా సబ్సిడీ ఇవ్వనున్నట్లు కలెక్టర్​పేర్కొన్నారు. ఈ సంస్థ బ్యాంకుల ద్వారా రవాణా రంగానికి సంబంధించి 8 ట్రాక్టర్లు, నాలుగు హార్వెస్టర్లు, నాలుగు వరినాటే యంత్రాలు, ఎనిమిది పవర్ టిల్లర్, 25 ప్యాసింజర్ సరుకు రవాణా వాహనాలు, ఆటోరిక్షాలను అందించనున్నట్లు వివరించారు. అలాగే పైలెట్ ప్రాజెక్టు కింద ఉద్యానవనం, వ్యవసాయ, చిన్న నీటిపారుదల, మినీ డెయిరీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో 64 మందికి ఒక్కో యూనిట్ కు రూ.ఐదు లక్షలతో ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు పరికరాల కొనుగోలుకు రూ.50వేల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామని వెల్లడించారు. ఎస్సీ నిరుద్యోగులు సంస్థ ద్వారా ఆర్థిక సాయం పొందేందుకు ఈనెల 31వ తేదీలోగా ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 21 నుంచి 50 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. అర్హులైన వారు weww.tsobmms.cgg.gov.in వెబ్ సైట్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అందులో ఆధార్ కార్డ్, ఆదాయం, రేషన్ కార్డు, కులధ్రువీకరణ పత్రాలు నమోదు చేయాలని పేర్కొన్నారు . ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న హార్డ్ కాపీలను సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ ​ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు.