Breaking News

నల్లవాగు భూముల ఆక్రమణపై విచారణ

నల్లవాగు భూముల ఆక్రమణపై విచారణ
  • ‘సామాజికసారథి’ కథనానికి స్పందన
  • రియల్​ వ్యాపారులపై ఉక్కుపాదం
  • సర్వేనం. 117లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
  • సమగ్ర విచారణకు ఆదేశించిన బిజినేపల్లి తహసీల్దార్​

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం లింగసానిపల్లి గ్రామసర్వేనం.117లో ‘నల్లవాగులో భూబకారాసులు’ శీర్షికన ‘సామాజికసారథి’లో వచ్చిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో నల్లవాగు భూముల ఆక్రమణపై శనివారం ఉదయం వెళ్లి విచారణ చేశారు. నల్లవాగులో ఉన్న ప్రభుత్వ భూమి సర్వేనం.117లో వెలిసిన ఇండ్లను వెంటనే కూల్చివేయాలని, వ్యవసాయ ప్రభుత్వ భూములలో ఇటుక బట్టీల నిర్మాణాలు చేస్తున్న వారికి కూడా నోటీసులు జారీ చేసి త్వరగా ఖాళీ చేయించాలని అక్కడి అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా పట్టా భూముల్లో ఉన్న రైతులను పిలిచి ఇక్కడి భూముల్లో ప్రభుత్వం పేదదళితులను సాగు చేసుకోవడానికి మాత్రమే భూములు పంపిణీ చేసిందని, ఇతరులకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ప్రభుత్వ భూమిలలో వెలిసిన వెంచర్లను రాళ్లను తొలగించాలని, ఇప్పటికే ప్రభుత్వ భూములు కొనుగోలు చేసిన వారికి నోటీసులు ఇచ్చి వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్​ అంజిరెడ్డి ఆదేశాలు జారీచేశారు. మూడు రోజుల్లోగా వ్యవసాయ భూముల్లో ఉన్న ఇళ్లను, రాళ్లను తొలగించాలని, లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అమ్మిన వారిపైన, కొనుగోలు చేసిన వారి పైన కఠినంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రభుత్వ భూమిలలో ఎవరైనా ప్లాట్లు కొని మోసపోకూడదని సూచించారు. చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మెడికల్ కాలేజీల పేరుతో నల్లవాగు నుంచి ఉయ్యాలవాడ వరకు ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు చేసి అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై క్రిమినల్​ కేసులు తప్పవని హెచ్చరించారు. విచారణ చేపట్టిన వారిలో డిప్యూటీ తహసీల్దార్​ రవికుమార్ ఉన్నారు. గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు.