Breaking News

నమో ఆంజనేయం

  • భక్తుల కొంగు బంగారంగా సహకార ఆంజనేయ స్వామి
  • పర్యాటకంగా అభివృద్ధిచెందుతున్న ఆలయం

సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్​ జిల్లా గొట్టిముక్కుల పంచాయతీ చాకలిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. దట్టమైన అరణ్యంలో కొలువైన ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతోంది. తూప్రాన్– నర్సాపూర్ మెయిన్​ రోడ్డుకు ఆనుకుని అరణ్యంలో కొలువైన సహకార ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తజనం వస్తుంటారు. కోరిన కోరికలు తీరుతుండడంతో స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఉమ్మడి మెదక్​ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్​ జంట నగరాలు, కర్ణాటక, మహారాష్ట్ర, వరంగల్​, కరీంనగర్​ తదితర ప్రాంతాల నుంచి భక్తులు నిత్యం తరలివచ్చి దర్శించుకుంటున్నారు. స్వామివారి విగ్రహంపై ఉదయం వేళ సూర్యకిరణాలు పడడం ఇక్కడి ఆలయ ప్రత్యేకత.


దాతల సాయంతో అభివృద్ధి
చాకలిమెట్ల ఆంజనేయ స్వామి ఆలయం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న దాతల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతోంది. ఆంజనేయ స్వామి, సత్యనారాయణ స్వామి ఆలయాలను సుమారు రూ.రెండుకోట్ల వ్యయంతో దాతల నిధులతో నిర్మించారు. సత్యనారాయణ స్వామి ఆలయం వజ్రాకారంలో నిర్మించడంతోపాటు గోపురంపై కలుశాన్ని ఏర్పాటుచేయడం ఇక్కడి ప్రత్యేకత. 11 అడుగుల సత్యనారాయణ స్వామి పాలరాతి విగ్రహంతో పాటు గణపతి, సరస్వతి, సీతారామలక్ష్మణ, ఆంజనేయస్వామి, సాయిబాబా దేవతామూర్తులను ప్రతిష్టించారు. సువిశాలమైన స్వామి మండపంలో ఒకేసారి వంద మంది దంపతులు కథ పీటలను ఏర్పాటు చేసుకుని సామూహిక వ్రతాలు ఆచరించేందుకు అవకాశం ఉంది.
కోరికలు తీర్చే వటవృక్షం
సంతానభాగ్యం లేకపోవడం, ఇతర ఇబ్బందుల్లో ఉన్న చాలామంది భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న వటవృక్షానికి(మర్రిచెట్టు) ముడుపులు కడుతుంటారు. ఇలా తమ కోరికలు తీరుతాయని వారి ప్రగాఢ విశ్వాసం.
నిత్య అన్నదానం
ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో 2014 హనుమాన్ జయంతి సందర్భంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన లింగయ్య, సురేందర్ రెడ్డి నిత్య అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్సాపూర్ ఆర్ బీవీఆర్ఐటీ చైర్మన్ విష్ణురాజు రూ.20 లక్షల నిధులతో వంటశాల, డైనింగ్ హాల్ నిర్మించారు. అందులోనే నిత్యం అన్నదానం కొనసాగుతోంది.
మరింత అభివృద్ధి చేస్తాం
సహకార ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం.
దాతల సహకారంతో ఆంజనేయ స్వామి, సత్యనారాయణ స్వామి ఆలయ నిర్మాణంతో పాటు వసతిగృహాలను ఏర్పాటుచేశాం. మరిన్ని వసతుల కల్పనకు కృషిచేస్తున్నాం. మనోహరాబాద్ కు చెందిన దాత దశరథ్ రెడ్డి సహకారంతో రూ.30 లక్షల వ్యయంతో సీతారామలక్ష్మణుల ఆలయ నిర్మాణం చేపడుతున్నాం. ఒకేచోట దేవతామూర్తులను దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
–ఆంజనేయశర్మ ఆలయ ఫౌండర్​, చైర్మన్​