Breaking News

దిగ్గజ బ్యాట్స్​మెన్ ఎవర్టన్ వీక్స్ ఇకలేరు

దిగ్గజ బ్యాట్స్​మెన్ ఎవర్టన్ వీక్స్ ఇకలేరు

బ్రిడ్జ్​టౌన్​: వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్​మెన్​ ఎవర్టన్ వీక్స్ (95) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆరునెలల క్రితం తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకున్న ఆయన వృద్ధాప్య సమస్యలోనే తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. 1925లో బార్బడోస్​లో పుట్టిన వీక్స్.. 1947–58 మధ్యకాలంలో విండీస్ తరఫున 48 టెస్టులు ఆడాడు. 58.61 సగటుతో 4,455 పరుగులు సాధించాడు. ఇందులో 15 శతకాలు, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 1948లో.. 22 ఏళ్ల వయసులో ఇంగ్లండ్(కింగ్​స్టన్​ ఓవల్)పై టెస్ట్ అరంగేట్రం చేసిన వీక్స్.. దశాబ్దం తర్వాత పాకిస్థాన్ (ట్రినిడాడ్)పై చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అప్పటి విండీస్ కెప్టెన్ జార్జ్ హెడ్లీ స్థాయిలో 58.61 సగటు సాధించిన వీక్స్.. ఆల్​టైమ్​ టాప్–10 జాబితాలో చోటు సంపాదించాడు. 1948లో వరుసగా ఐదు శతకాలతో వీక్స్.. ప్రపంచ రికార్డు నెలకొల్పారు. జమైకాలో ఇంగ్లండ్​పై 148 పరుగులు చేసిన ఆయన.. భారత పర్యటనలో వరుసగా 128, 194, 162, 101 పరుగులు సాధించాడు. చెన్నైలో జరిగిన చివరి మ్యాచ్​లో 90 పరుగుల వద్ద రనౌట్ కావడంతో ఆరో శతకాన్ని తృటిలో కోల్పోయాడు.

‘త్రీ డబ్ల్యూఎస్’ లేరు

సర్ ఫ్రాంక్ వోరెల్, సర్ క్లైడ్ వాల్కట్, ఎవర్టన్ వీక్స్​ను.. విండీస్ క్రికెట్​లో ‘త్రీ డబ్ల్యూఎస్’గా పిలుస్తారు. ఈ ముగ్గురు 1948లోనే టెస్ట్ అరంగేట్రం చేయడం మరో విశేషం. అయితే 1967లో వోరెల్ మృతి చెందగా, 2006లో వాల్కట్ కన్నుమూశారు. ఈ త్రయంలోచివరి వాడైన వీక్స్ లోకాన్ని వీడడంతో త్రీ డబ్ల్యూఎస్ శకం ముగిసింది. ఈ ముగ్గురు కలిసి 39 సెంచరీలు కొట్టడం గమనార్హం. కెరీర్​కు వీడ్కోలు పలికిన తర్వాత వీక్స్ క్రికెట్​లోనే ఎక్కువగా గడిపారు. కోచ్​గా, రెఫరీగా, టీమ్ మేనేజర్​గా, ఎనలిస్ట్​గా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. వీక్స్ సేవలకు మెచ్చిన ఐసీసీ ప్రతిష్టాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కూడా కల్పించింది. ఓవరాల్​గా 1994లో మూడు టెస్టులు, నాలుగు వన్డేలకు మ్యాచ్ రెఫరీగా పనిచేశారు. వీక్స్ మృతిపై ఐసీసీ, విండీస్ క్రికెట్ బోర్డుతో పాటు సచిన్, రిచర్ట్స్​లాంటి క్రికెటర్లు సంతాపం ప్రకటించారు. వీక్స్​కు సంబంధించి ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని క్యాబ్ ప్రకటించింది.