దిగ్గజ నటుడు రిషికపూర్ ఇకలేరు
బాలీవుడ్ సినీప్రపంచంలో మరో విషాదఘటన చోటుచేసుకుంది. దిగ్గజ నటుడు రిషికపూర్ గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేర్పించగా, అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భార్య నీతూకపూర్, రిషికపూర్ సోదరుడు రణధీర్ కపూర్, రిషికపూర్ కుమారుడు రణబీర్ కపూర్ ఆస్పత్రి వద్దే ఉన్నారు. రిషి మరణవార్త విని వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
‘మేరా నామ్ జోకర్’తో అరంగేట్రం
1952 సెప్టెంబర్ 4 రిషి ముంబైలో జన్మించారు. ప్రముఖ నటుడు రాజ్ కపూర్ కు రిషి రెండవ కుమారుడు. ‘మేరా నామ్ జోకర్’ మూవీలో బాలనటుడిగా సినీప్రపంచంలోకి అడుగు పెట్టిన రిషి.. బాబీ మూవీతో హీరోగా అరంగేట్రం చేశారు. ఇటీవలే తన కొత్త సినిమా ప్రాజెక్టును కూడా ప్రకటించారు. హాలీవుడ్‌లో చేయబోయే ‘ది ఇంటర్న్’ అనే ఆ సినిమాలో దీపికా పదుకొణేతో కలిసి నటించబోతున్నారు. ఇంతలోనే ఆయన కన్నుమూశారు.
బాలీవుడ్ శోకసంద్రం
ఏప్రిల్ 29న బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతిచెందిన షాక్ నుంచి తేరుకోకముందే రిషి మరణవార్త వినాల్సి వచ్చింది. ఇర్ఫాన్ ఖాన్ కూడా కొన్నేళ్లుగా కేన్సర్ వ్యాధితో పోరాటం చేస్తూ మృతిచెందారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో బుధవారం కన్నుమూశారు. ఇర్ఫాన్ మృతి సినీ పరిశ్రమనే కాకుండా రాజకీయ ప్రముఖులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు రిషికపూర్ లేడనే వార్త చిత్ర పరిశ్రమని, అభిమానులను మరింత కుంగదీస్తోంది.