సారథి న్యూస్, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన దళిత రైతులపై కొందరు తాము ఎమ్మెల్యే కాలె యాదయ్య అనుచరులమని రుబాబు చూపించారు. దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధిత రైతుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన జూకంటి గోపయ్యకు సర్వేనం.116లో 15 ఎకరాల పట్టా భూమి ఉంది. దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్నాడు. ఆదివారం ఎమ్మెల్యే కాలె యాదయ్య అనుచరుల పేరుతో 30 మంది రెండు జేసీబీలు తీసుకొచ్చి ఈ భూమి తమదని కూర్చున్నారు. పంటను దున్నివేయడంతో పాటు గోపయ్య కొడుకులు గోవర్దన్, అంజయ్య, కృష్ణలను కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. మహిళలను కూడా పరుషపదజాలంతో తిట్టారు. వారిలో చేవెళ్లకు చెందిన మద్దెల చింటు(నర్సింలు) అనే వ్యక్తి తాను ఎమ్మెల్యే యాదయ్య అనుచరుడినని, చేవెళ్ల మార్కెట్ కమిటీకి కాబోయే చైర్మన్ అంటూ చిందులేశాడు. బాధిత రైతు గోపయ్య మాట్లాడుతూ భూమిపై తనకు, తన సోదరులకు కొన్నేళ్లుగా కోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. వాళ్లు అగ్రిమెంట్ చేసినట్లు ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారని, కోర్టులో కేసు ఉన్న భూమిలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- August 30, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- CHEVELLA
- MLA YADAIAH
- MUDIMYALA
- RANGAREDDY
- ఎమ్మెల్యే యాదయ్య
- చేవెళ్ల
- ముడిమ్యాల
- రంగారెడ్డి
- Comments Off on దళిత రైతులపై ఎమ్మెల్యే మనుషుల రుబాబు