Breaking News

దయచేసి పక్క బ్రాంచ్‌కు వెళ్లండి

దయచేసి పక్క బ్రాంచ్‌కు వెళ్లండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ‘మా బ్యాంకులో ఉద్యోగి కోవిడ్‌ బారిన పడినందున బ్యాంక్‌ను మూసివేశాం. దయచేసి మరో బ్రాంచ్‌కు వెళ్లండి’. ‘మా కార్యాలయంలో ఇద్దరికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. దయచేసి సహకరించండి’ ఇవీ హైదరాబాద్‌ నగరంలో కనిపిస్తున్న బోర్డులు. నగరంలో ఇటీవల కాలంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇందులో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కూడా భారీగానే ఉండడంతో నగరంలోని అనేక బ్యాంకులు, కార్యాలయాలు శానిటైజేషన్‌ పేరుతో రోజుల కొద్ది మూసివేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో వందల్లో ఉన్న కరోనా కేసులు వేలల్లోకి మారాయి. ప్రధానంగా లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత ఈ కేసులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.

కనీస జాగ్రత్తలు పాటించకపోవడం మరింత ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ప్రభుత్వం లక్షణాలుంటేనే పరీక్షలు చేస్తుండడం, అనేక కారణాలతో ప్రైవేట్​ ల్యాబ్‌లను తరచూ మూసివేస్తుండడంతో కరోనా బాధితులు తక్షణమే టెస్టులు చేయించుకోలేకపోతున్నారు. దీంతో వారిద్వారా మరింత మందికి ఈ వైరస్‌ సోకుతోంది. పైగా ప్రభుత్వం కూడా కరోనా బాధితుల వివరాలు, వారుంటున్న ప్రాంతాలను తెలపకపోవడంతో జనం కరోనా బాధితులకు దూరంగా ఉండడానికి ఆస్కారం లేకుండా పోతోంది. కనీసం కరోనా బాధితులు ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని గుర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపడితే ఆ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మరిన్ని జాగ్రత్తలు పాటించే వీలుంటుందని, అలా తెలియకపోవడం వల్ల నిత్యం బాధితుల మధ్యే తిరగాల్సి వస్తుందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాధితులను గాలికొదిలిన సర్కారు
ఇప్పుడు హైదరాబాద్‌ నగరంలో కరోనా టెస్టులు చేసిన తర్వాత మూడు రోజులకు రిపోర్టులు ఇస్తున్నారు. ఎవరికైనా పాజిటివ్‌ వస్తే వారికి ఫోన్‌చేసి మీకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకోవాలని ఉచిత సలహా పారేస్తోంది ప్రభుత్వం. అయితే, పాజిటివ్‌ సోకిన వారు ఇంట్లోనే ఉండకుండా యథాలాపంగా బయట తిరుగుతున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు పాజిటివ్‌ వచ్చిందని తెలిస్తే ఇంటి పక్క వాళ్లు తమ గురించి ఏమనుకుంటారోనన్న ఆలోచనతో ఈ విషయాన్ని దాచి పెడుతున్నారు. రోజుల కొద్ది ఇంట్లోనే ఉండి బయటకు రాకపోతే వారికి ఎక్కడ అనుమానం వస్తుందోనన్న ఆలోచనతో పాజిటివ్‌ వ్యక్తులు బయట తిరుగుతున్నారని నగరవాసులు అభిప్రాయ పడుతున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న కరోనా బాధితుల గురించి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకుండా గాలికొదిలేస్తున్నారని, దీంతో వారి ద్వారా ఎక్కువ మందికి ఈ వైరస్‌ చాలా త్వరగా సోకుతుందని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హోం క్వారంటైన్‌లో ఉన్న బాధితులు బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.