Breaking News

తెలుగు ఐఏఎస్‌ అధికారి కోటా రవికి కీలక బాధ్యతలు

సారథి న్యూస్, శ్రీకాకుళం: అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా సంతబొమ్మాళి మండలం, కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి కోటా రవి నియమితులయ్యారు. వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఎకానమిక్‌ మినిస్టర్‌గా విధులు నిర్వహించనున్నారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్న రవి భారత్ తరఫున ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ నియామకాల కమిటీ గురువారం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కోటపాడు గ్రామానికి చెందిన రవి 1993 బ్యాచ్‌ అస్సాం కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. రెండున్నరేళ్లుగా 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
అంచెలంచెలుగా ఎదిగి..
సంతబొమ్మాళి మండలం, కోటపాడు కొత్తూరు ప్రభుత్వ స్కూలులో రవి ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు దండుగోపాలపురం జడ్పీ హైస్కూల్​, ఇంటర్​మీడియట్​ టెక్కలి గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీ, డిగ్రీ టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, బాపట్ల అగ్రికల్చర్​ కాలేజీలో ఎమ్మెస్సీ చదివారు. న్యూఢిల్లీలోని ఐఆర్​ఐలో పీహెచ్​డీ చేశారు.
కీలకమైన పదవులు
అస్సాం రాష్ట్రంలో జోరహాట్, గోలాఘాట్, దిమ్నాఘర్ జిల్లాల్లో కలెక్టర్ గా రవి విధులు నిర్వహించారు. అస్సాం రాష్ట్రానికి అగ్రికల్చర్, ఫైనాన్స్​ సెక్రటరీగా పనిచేశారు. న్యూఢిల్లీలో మానవ వనరులశాఖలో సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్ గానూ పనిచేశారు. తెలుగు అధికారికి కీలకమైన పదవి దక్కడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.