Breaking News

తుంగ తీరం.. భక్తజన సంద్రం

– తుఫాన్​ జల్లుల్లో పుష్కరస్నానం

సారథి న్యూస్​, మానవపాడు: జోగుళాంబ గద్వాల అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారి సన్నిధిలో తుంగభద్ర తీరం భక్తి పారవశ్యంతో మునిగిపోయింది. శుక్రవారం పుష్కరఘాట్ కు పెద్దసంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. పవిత్ర కార్తీకమాసం కావడంతో భక్తులు తుంగభద్ర నదీమ తల్లిని కార్తీక దీపాలతో ఆరాధిస్తున్నారు. కార్తీకదీపాలు వెలిగిస్తూ అమ్మవారిని, అదేవిధంగా బాలబ్రహ్మేశ్వరుడికి ప్రత్యేకపూజలు చేశారు. ఓ వైపు తుఫాన్ ప్రభావంతో మేఘాలు కమ్మేసి వాన జల్లులు కురుస్తున్నా యాత్రికులు మాత్రం పుష్కర స్నానాలు చేస్తున్న దృశ్యాలు అలంపూర్​ లో శుక్రవారం కనిపించాయి. పుష్కరాలు ప్రారంభమై 8 రోజులు కావస్తున్నా భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు రెండులక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారుల అంచనా. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. అయితే కొంతమంది భక్తులు సాయంత్రం కూడా వచ్చి పుష్కర స్నానాలు చేసి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.