Breaking News

తినకున్నా బిల్లు కట్టాల్సిందేనట..!

తినకున్నా బిల్లు కట్టాల్సిందేనట

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఎక్కడైనా తింటే బిల్లు కడతాం. కానీ, కొన్ని ప్రైవేట్​ స్కూళ్లు, కాలేజీలు మాత్రం మీరు తినకున్నా సరే.. బిల్లు మాత్రం కట్టాల్సిందేనని చెబుతున్నాయి. ఇది విన్న విద్యార్థుల పేరెంట్స్​ నోరెళ్ల బెడుతున్నారు. అనేక ప్రైవేట్​ స్కూళ్లు, కాలేజీలు, సెమీ రెసిడెన్షియల్‌గా నడుస్తున్నాయి. సెమీ రెసిడెన్షియల్‌ అంటే విద్యార్థి ఉదయం వెళ్లేటప్పుడు ఇంట్లో టిఫిన్‌ తిని స్కూలుకో, కాలేజీలో వెళ్తాడు. మధ్యాహ్నం భోజనం పెడతారు. సాయంత్రం క్లాసులు పూర్తయిన తర్వాత కూడా వారికి స్టడీ అవర్స్‌ నిర్వహిస్తారు. దీంతో అతడు ఇంటికి వెళ్లేటప్పటికి రాత్రవుతుంది. కాబట్టి సాయంత్రం ఆ విద్యార్థికి స్నాక్స్‌ ఇస్తారు. తిరిగి సదరు విద్యార్థి ఇంటికి వెళ్లిన తర్వాత రాత్రి భోజనం ఇంటి వద్దే చేస్తాడు. ఇదీ సెమిరెసిడెన్షియల్‌ విధానం. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ ఖర్చును విద్యార్థి వార్షిక ఫీజుతో కలిపి నిర్ణయించి వసూలు చేస్తారు. ఇంతవరకూ బాగానే ఉంది. గతేడాది వరకు ఇది బాగానే వర్కవుట్‌ అయింది. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా బాగానే ఉంది. కానీ, ఈ ఏడాది పరిస్థితుల్లో మార్పు వచ్చింది.
కరోనా దెబ్బతో..
కరోనా దెబ్బకు విద్యావ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. అయితే, అనేక ప్రైవేట్​ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసులంటే విద్యార్థులు ఎవరింట్లో వారు ఉంటూ కంప్యూటర్, ట్యాబ్, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో పాఠాలు వింటారు. ఎవరూ పాఠశాలకు వెళ్లరు. అయితే, యాజమాన్యాలు మాత్రం గతంలో లాగానే సెమి రెసిడెన్షియల్‌ ఫీజులను చెల్లించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ‘అవన్నీ మాకు తెలియదు ఆ ఫీజులు చెల్లిస్తేనే మీ పిల్లలను ఇక్కడ ఉంచండి.. లేకుంటే వేరే దగ్గరకు పంపండి’ అని బెదిరిస్తున్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక వారు తలలు పట్టుకుంటున్నారు. తింటే బిల్లు కడతాం కానీ, తినకుండానే బిల్లు కట్టడం ఏమిటోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని పాఠశాలలు క్లాసులు ప్రారంభించకుండానే ఫీజుల కోసం ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్​ విద్యాసంస్థల ఆగడాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్​, పేరెంట్స్​కోరుతున్నారు.