Breaking News

తిండి లేకే ఆ తల్లి చనిపోయింది..

  • బీహార్‌ ప్రభుత్వం, రైల్వే శాఖపై ఎన్‌ఆర్‌సీకి లాయర్​ ఫిర్యాదు

పాట్నా: ముజ్‌ఫర్‌‌పూర్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన యావత్ భారతదేశాన్ని కలిచివేసింది. ఎండల తీవ్రతకు తల్లి చనిపోయిందని కూడా తెలుసుకోలేని రెండేళ్ల పిల్లాడు ఆమె శవం పక్కనే కూర్చొని ఆడుకున్న ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. ఇక ఈ ఘటనపై మహమ్మూద్ అనే లాయర్ బీహార్‌ ప్రభుత్వం, రైల్వే శాఖపై ఎన్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశా రు. సదరు మహిళ రైల్వే స్టేషన్‌లో సరైన ఆహారం, వసతి లేకే చనిపోయిందని.. దీనికి బీహార్ ప్రభుత్వం, రైల్వేశాఖల వైఫల్యమే కారణమని ఆయన పేర్కొన్నారు. మే 25న రికార్డు అయిన సీసీ టీవీ ఫుటేజీని సీజ్ చేసి బీహార్ ప్రభుత్వం, రైల్వేశాఖలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు కనీస సౌకర్యాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, రైల్వేశాఖ వలస కార్మికులకు సరైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వివరించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత గౌరవంతో జీవించే హక్కు ఉందని, అంతేకాక వారికి కనీస వసతులు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, సదరు మహిళ కుటుంబానికి తక్షణమే నష్ట పరిహారాన్ని చెల్లించే విధంగా ఆదేశాలు జారీచేయాలని ఎన్‌ఆర్‌సీని కోరారు.